కాంగ్రెస్ పార్టీకి డా.నాగం జనార్థన్ రెడ్డి రాజీనామా చేశారు.. త్వరలో బీఆర్ఎస్ లో చేరనున్నట్టు తెలిపారు నాగం… నాగర్ కర్నూలు టికెట్ ఆశించినా దక్కకపోవడంతో కాంగ్రెస్ నేతలపై విమర్శలు చేశారు. అనుచరులతో చర్చల అనంతరం కీలక నిర్ణయం తీసుకున్న నాగం … త్వరలో కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నట్టు ప్రకటించారు.
అప్పట్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేవేందర్ గౌడ్, నాగం జనార్దన్ రెడ్డి చక్రం తిప్పేవారు. ఇప్పుడు వారి రాజకీయ జీవితం ముగింపుకు వచ్చినట్టు కనిపిస్తోంది. దేవేందర్ గౌడ్ ఇంటిపట్టున ఉంటుండగా.. నాగం జనార్దన్ రెడ్డి పరిస్థితి మాత్రం జాతరలో తప్పిపోయిన పిల్లాడిలా మారిపోయింది. నాగం జనార్దన్ రెడ్డి టిడిపిలో ఒక వెలుగు వెలుగుతున్న సందర్భంలో రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. అప్పటికి నాగం జనార్దన్ రెడ్డి టిడిపిలో నెంబర్ _2 గా ఉన్నారు. తెలంగాణ ఉద్యమం ఉధృతం అవుతున్న నేపథ్యంలో నాగం జనార్దన్ రెడ్డి తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. తెలంగాణ వ్యక్తిగా, తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకిస్తూ, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా నాటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పై ధ్వజమెత్తారు. అప్పటికి తెలుగుదేశం పార్టీలో తన స్థానానికి డోకా లేదు అనుకున్నారు. కోదండ రామ్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ జేఏసీ ఏర్పాటు అయిన తర్వాత.. ఒకరోజు నాగం..తెలంగాణ రెడ్డి నాయకుడిగా కోదండరాం ఎదిగిపోతున్నారని కంగారు పడ్డారు. తెలంగాణ ఉద్యమం చివరి దశకు చేరుకున్న సమయంలో సభలో చంద్రబాబును వ్యతిరేకించినట్లు మాట్లాడి.. సంచలనం రేకెత్తించారు. సభలో విడిగా కూర్చొని.. ఆ తర్వాత వెళ్లి బాబు పక్కన కూర్చోగానే.. జిల్లాకు చెందిన మరో నేత.. తిరుగుబాటు చేస్తున్న వారు అలానే విడిగా ఉండాల్సింది, బాబు పక్కన కూర్చోగానే నాగం పని అయిపోయింది, అది ఆయనకు అర్థం కావడం లేదని పేర్కొన్నారు.
టిడిపిలో నాగం జనార్దన్ రెడ్డి ఒక వెలుగు వెలుగుతున్నప్పుడు కేసీఆర్ ఎక్కడో ఉన్నారు. కెసిఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసిన తర్వాత.. తెలంగాణ ఉద్యమాన్ని తన కను సన్నల్లో ఉంచుకున్న తర్వాత ఆయన నాయకత్వంలో ఎలా పని చేయాలో తెలియక నాగం జనార్దన్ రెడ్డి అటువైపు వెళ్ళలేదు. మరో వైపు నాగం సామాజిక వర్గానికి చెందిన కోదండరాం తెలంగాణ ఉద్యమ సంస్థను ఏర్పాటు చేశారు. ఎందుకైనా మంచిదని అందులోకి వెళ్లారు.ఆ తర్వాత అక్కడి నుంచి బిజెపికి, బిజెపి లోనుంచి కాంగ్రెస్లోకి నాగం జనార్దన్ రెడ్డి వెళ్లిపోయారు. టిడిపి నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడయ్యారు. తను ఒక వెలుగు వెలుగుతున్నప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితిలో ఒక సాధారణ కార్యకర్త అయిన రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయినప్పటికీ.. తన టికెట్ మీద నాగం జనార్దన్ రెడ్డి అలాగే ఆశలు పెట్టుకున్నారు. అప్పట్లో కెసిఆర్ కింద పని చేయడానికి ఒప్పుకోని నాగం జనార్దన్ రెడ్డి.. రేవంత్ రెడ్డి కింద పనిచేసేందుకు మాత్రం ఎటువంటి ఇబ్బందీ పడలేదు.. రేవంత్ రెడ్డి టికెట్లు ఇచ్చే స్థానంలో ఉండగా.. నాగం జనార్దన్ రెడ్డి టికెట్ ఆశించే స్థానంలోనే ఉన్నారు. అయిప్పటికీ ఆయనకు టికెట్ దక్కలేదు. అందుకే అంటారు ఓడలు బండ్లవుతాయి. బండ్లు ఓడలవుతాయి. మరీ ముఖ్యంగా ఇది రాజకీయాల్లో ఇవి రిపీట్ అవుతూనే ఉంటుంది. మరిప్పుడు నాగం పరిస్థితి ఏంటి?
టికెట్ దక్కకపోవటంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు నాగం జనార్థన్ రెడ్డి. రేవంత్ రెడ్డి నమ్మకద్రోహి అని డబ్బులకు టికెట్లు అమ్ముకుంటున్నారని దుమ్మెత్తిపోశారు. నాగర్ కర్నూర్ లో కాంగ్రెస్ పార్టీ ఎలా గెలుస్తుందో చూస్తానని… పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా పైసలు ఇచ్చినోళ్ళకి మాత్రమే పార్టీ టికెట్లు ఇస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి మోసం చేసి నమ్మకద్రోహం చేసిన వ్యక్తులకు నాగర్ కర్నూల్ టికెట్ ఇవ్వడం పెద్ద వింత అని చెప్పుకొచ్చారు. పదేళ్లుగా ప్రభుత్వంపై ఎన్నో కేసులు వేసి బీఆర్ఎస్ పార్టీ నాయకుల చేతిలో ఎన్నో తిట్లు తిని ఎన్నో కేసులు అనుభవిస్తున్న తనకు టికెట్ ఇవ్వకుండా కొత్తగా వచ్చిన అభ్యర్థికి టికెట్ ఇవ్వడమేంటని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో మెజార్టీ సీట్లు గెలవాలని కాంగ్రెస్ భావిస్తుండగా నాగం బీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించడంతో పరిస్థితి ఎలా మారుతుందో చూడాలి.