తమిళ తలైవా, జైలర్ రజనీకాంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.. దక్షిణాదిలోనే కాదు యావత్ భారత్ వ్యాప్తంగా ఆయనకు లక్షలాదిమంది అభిమానులు ఉన్నారు. తాజాగా కేరళలో టీ అమ్ముతూ కనిపించారు రజనీకాంత్. ఇదేదో సినిమా షూటింగ్ కాదు. నిజంగానే కొచ్చిలో సూపర్ స్టార్ రజనీకాంత్ టీ అమ్ముతున్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఓ వ్యక్తి రహదారి పక్కన నిలబడి ఉన్నాడు. నీలం రంగు చొక్కా, షార్ట్ లో నిలబడిన అతను ఎవరితోనో మాట్లాడుతూ కనిపించాడు. ఆ తలకట్టు, రూపం అచ్చం రజనీ సర్ లాగే ఉండటంతో ఆయన్ను చూసినవారు షాకవుతున్నారు. అతను ఎవరితోనో మాట్లాడుతూ జుట్టును రెండుచేతులతో అలా సవరించడం, తరువాత కరచాలనం చేయడం భలే సరదాగా ఉంది.
ఇదేమైనా కొత్త సినిమా షూటింగ్ లో భాగమేమో అనుకున్న వారు కూడా ఉన్నారు. కానీ అసలు విషయం ఏమిటంటే ఆయన మన సూపర్ స్టార్ రజనీకాంత్ కాదు. అచ్చం ఆయనలాగే ఉన్న మరొక వ్యక్తి. సడన్ గా చూసి రజనీకాంత్ అనుకోని వ్యక్తి ఉండదంటే అతిశయోక్తి కాదు.అంత దగ్గరి పోలికలు ఉన్నాయి రజనీకాంత్ గారికి, ఇతనికి. ఇతను కొచ్చిలో టీ దుకాణం పెట్టుకుని టీ అమ్ముతుంటాడట. ఈయన పేరు సుధాకర్ ప్రభు.. కొచ్చిలోని వెంకటేశ్వర హోటల్ ఓనర్. ఈయన రజనీ రూపంతో ఉండడంతో తెగ వైరల్ అవుతున్నారు. ఓవర్ నైట్ ఇంటర్నెట్ స్టార్ అయిపోయారు. ఎక్స్ లో ఈ వీడియో షేర్ అవుతోంది. స్వయానా రజనీకాంతే అలా రహదారి మీద టీ అమ్ముతున్నారని చాలామంది పొరబడుతున్నారు. దగ్గరికి వెళ్లి పలకరిస్తే గానీ అసలు విషయం బోధపడదు. ఇంటర్నెట్ వచ్చాక ఇలాంటి వ్యక్తులు చాలా ఫ్యామస్ అయిపోతున్నారు. తలైవా మజాకా.. అంటున్నారంతా..