తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇంకా అధికారం చేతిలోకి రాకుండానే సీఎం ఎవరనేదానిపై హాట్ కామెంట్స్ చేస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఒకే ఒక్కడు తూర్పు జయప్రకాష్ రెడ్డి ఎలియాస్ జగ్గారెడ్డి నిత్యం ఏవో కామెంట్స్ తో సోషల్ మీడియాలో రచ్చరంబోలా చేస్తుంటారు. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. విజయదశమి ఉత్సవాల్లో భాగంగా సంగారెడ్డిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వచ్చే పదేళ్లలో తాను తెలంగాణకు ముఖ్యమంత్రిని అవుతానని చెప్పారు. విజయదశమి సందర్భంగా తన మనసులో మాట చెబుతున్నట్టు జగ్గారెడ్డి వెల్లడించారు. ఇప్పుడీ వ్యాఖ్య రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సంగారెడ్డి అంటే జగ్గారెడ్డి అని.. జగ్గారెడ్డి అంటే సంగారెడ్డి అని దీనిని ఎవరూ కాదనలేరని అన్నారు.ఇంకా చాలా విషయాలను పంచుకునే వాడినని.. కానీ ఎన్నికల కోడ్ నేపథ్యం తన నోరు, చేతులు కట్టేశారని జగ్గారెడ్డి అన్నారు. తాను ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటానని తెలిపారు. నియోజకవర్గంలో తాను అందుబాటులో ఉన్నా లేకున్నా తన భార్యతో పాటు అనుచరులు అందుబాటులో ఉంటారన్నారు. తమ పార్టీ కార్యకర్తలకు ఏ అవసరం వచ్చినా వెంటనే అక్కడే ఉంటానన్నారు. తనపై ఎప్పటికీ ప్రజల ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నట్టు జగ్గారెడ్డి తెలిపారు.
ఇదిలా ఉంటే తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీ కాంగ్రెస్ లో సీఎం ఎవరనేది బాగా చర్చకు దారితీస్తోంది. ‘ఆలు లేదు, చూలు లేదు… కొడుకు పేరు సోమలింగం’ అంటే ఇదే కాబోలు! పార్టీ అధికారంలోకి వస్తుందా? లేదా? పక్కనపెట్టి… వస్తే, గిస్తే ముఖ్యమంత్రి అయ్యేదెవరు? ఫలానా సమీకరణమయితే అదుగో ఆయనే ముఖ్యమంత్రి.. కాదు, ఆయనెలా అవుతారు, ఇదుగో ఈయన..’ ఇలాంటి చర్చ జోరందుకుంది. ఇప్పటికో పది పేర్లు ముఖ్యమంత్రి పదవి చుట్టూ గిరికీలు కొడుతున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో ఒక్కసారిగా చలనం వచ్చింది. చేరికలు తెస్తున్న ఊపుతో పాటు క్రమంగా హైకమాండ్ పట్టు బిగుస్తున్న సంకేతాలు నేతల్లో అధికారంపై ఆశల్ని సజీవం చేస్తున్నాయి. అధికారం వస్తే చాలదు పగ్గాలు మా చేతుల్లో ఉండాలనే మాటలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ అధినాయకత్వం ఏ రాష్ట్రంలోనైనా, అవసరార్థం సొంత పార్టీలో అసమ్మతిని పోషించగలదే తప్ప తగ్గించలేదు. మరీ ముఖ్యంగా కేంద్రంలో బలహీనంగా ఉన్నపుడు దుస్సాధ్యమే! ‘ముఖ్యమంత్రి ఎవరన్నది ఇప్పటి నుంచే అనవసరం, ముందు పార్టీని గెలిపించి అధికారంలోకి తెండి, ఫలితాల తర్వాతే మిగతావి’ అని రాష్ట్ర నాయకులకు అధిష్టానం తరచూ చెబుతోంది. కర్నాటకను ఉదాహరణగా చూపుతోంది. అయినా, పార్టీ నాయక, కార్యకర్తల, శ్రేణుల్లో మాత్రం వ్యూహ-ప్రతివ్యూహాలు కొనసాగుతూనే ఉన్నాయి. క్రమంగా పార్టీకి ఊపు పెరుగుతోందని భావిస్తున్న వారు ‘కాంగ్రెస్ గెలిస్తే సీఎం పీఠమెవరకి?’ అన్న చర్చను కావాలనే లేవనెత్తుతున్నారు. ‘ఇంకెవరు, పీసీసీ పగ్గాలు పట్టుకున్న రేవంతే!’ అని కొందరంటే, ‘ఆ… ఆయన్ని కానిస్తారా?’ అనేది మరోవర్గం మాట! ‘సీనియర్లు’ అనే బ్రహ్మ పదార్థం గొడుగు నీడలో తమ కార్యకలాపాలు నిర్విఘ్నంగా సాగిస్తున్న కొంతమంది మాత్రం, పార్టీ అధికారంలోకి వస్తే అంత తేలిగ్గా రేవంత్‌ను సీఎంను కానీయొద్దని ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. తమ ప్రాబల్యం కాపాడుకునే క్రమంలో… ప్రత్యామ్నాయ నాయకత్వం పేరును తెరమీదకు తెస్తున్నారు. ప్రజలు పార్టీని గెలిపిస్తే, ఈసారి పట్టం దళితులకే అంటున్నారు. అయితే భట్టి మాత్రం తానెప్పుడూ సీఎం కావాలని అనుకోలేదంటున్నారు. అధిష్టానం ఇస్తానంటే వద్దనేదెవరు? ఢిలీ ఆశీస్సులున్న ఒక లాబీ, ఈ దిశలో గట్టిగానే పనిచేస్తోంది. జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, జీవన్ రెడ్డి… తాజాగా జగ్గారెడ్డి ఇలా క్రికెట్ జట్టులో సభ్యుల్లా నేనే సీఎం అవుతా అనేస్తున్నారు. ఈ సీఎం రేసు గురించి చదువుతున్న జనం మాత్రం అసలు ఓటేయాల్సింది మేం కదా… అవేం లేకుండా మీకు మీరే సీఎం అనుకుంటే ఎలా కుదురుతుంది. డిసైడ్ చేసేది మేము.. మేం మీట నొక్కితేనే మీకు అధికారం అంటున్నాడు కామన్ మ్యాన్. మరి ఈ సీఎం రేసులో ఇంకెంతమంది తెరమీదికి వస్తారో చూడాలి మరి.