తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ రెండు ఫీట్ల మేర కుంగిపోవడం హాట్ టాపిక్ అవుతోంది. ఈ బ్యారేజీ 7వ బ్లాక్‌లోని 20వ నంబర్ పిల్లర్ రెండురోజుల్లో రెండు అడుగులు కుంగిపోయింది. దీంతో దానికి ఇరువైపులా ఉన్న 19, 21వ పిల్లర్లపైనా ఎఫెక్ట్ పడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బ్యారేజీకి ముప్పు పొంచి ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. బ్యారేజీ పైనుంచి రాకపోకలు బంద్ చేశారు పోలీసులు. అటు మహారాష్ట్ర, ఇటు తెలంగాణ వైపు బందోబస్తు ఏర్పాటు చేశారు. బ్యారేజీ వైపు ఎవరూ వెళ్లకుండా పహారా కాస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్‌లో 24 గంటల్లో 16,368 క్యూబిక్ మీటర్ల సిమెంట్ కాంక్రీట్ పని చేసిఏపీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ దేశవ్యాప్తంగా రికార్డ్ నెలకొల్పింది. అలాగే ఓ షాపింగ్ మాల్ నిర్మాణంలో 64 గంటల్లో 20,400 క్యూబిక్ మీటర్ల సిమెంట్ కాంక్రీట్ పనులు చేసి దుబాయ్ ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఈ రెండు రికార్డులను తిరగరాసేందుకు తెలంగాణ ఇరిగేషన్ ఆఫీసర్లు.. మేడిగడ్డ బ్యారేజీ ఫౌండేషన్ పనులను ఎంచుకున్నారు. అయితే నదిలో బ్యారేజీ నిర్మాణం సవాల్‌తో కూడుకున్నదని, ఫౌండేషన్ సరిగ్గా లేకపోతే మొదటికే మోసం వస్తుందని, రికార్డు కోసం మేడిగడ్డను ఎంచుకోవడం కరెక్ట్ కాదని ఎల్అండ్టీ ఇంజనీర్లు చెప్పారు. కానీ వాటిని అంతగా పట్టించుకోలేదని విమర్శలు వస్తున్నాయి.
కాళేశ్వరానికి దేశవ్యాప్త గుర్తింపు తేవాలనే లక్ష్యంతో రాష్ట్ర సర్కారు ఇరిగేషన్ ఆఫీసర్లు, ఎల్అండ్టీ ఇంజినీర్ల మెడపై కత్తి పెట్టి ఫౌండేషన్ పనులను రికార్డు టైమ్‌లో చేయించింది. 2018 డిసెంబర్ 23న 24 గంటల్లో 16,722 క్యూబిక్ మీటర్ల సిమెంట్ కాంక్రీట్ పనులు చేయించి.. ఏపీ పేరిట ఉన్న రికార్డును అధిగమించింది. అప్పుడు ఫౌండేషన్ సమయంలోనే 7వ బ్లాక్‌లోని 20వ నంబర్ పిల్లర్ దగ్గర సమస్య ఉత్పన్నమైనట్లు అప్పట్లో కొందరు ఇంజనీర్లు లీక్ఇచ్చారు. కానీ ఆ సమస్యను చిన్నదిగా చూపించి పరిష్కరించినట్లు పేర్కొన్నారు. నాలుగేండ్ల తర్వాత ఇప్పుడు అదే 20వ నంబర్ పిల్లర్ కారణంగా బ్యారేజీ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని అంటున్నారు.
మేడిగడ్డ బ్యారేజీకి మొత్తం 85 గేట్లు ఉన్నాయి. 7వ బ్లాక్‌లో 11 పిల్లర్లు ఉండగా, వీటిలో 20వ నంబర్ పిల్లర్ పగుళ్లు వచ్చి కుంగిపోయింది. దీంతో గేట్ల నుంచి సౌండ్ వచ్చింది. బ్యారేజీపై ఉన్న రోడ్డు షేప్ మారిపోవడంతో ఈ విషయం బయటపడింది. ఆదివారం బ్యారేజీపై ఉన్న రోడ్డును పరిశీలిస్తే రెండు ఫీట్ల వరకు కిందికి కుంగిపోయింది. శనివారం రాత్రి 9 ఇంచుల వరకు కుంగిన రోడ్డు.. ఆదివారం నాటికి ఇంకా కుంగిపోవడంతో 20వ పిల్లర్‌తో పాటు దానికి పక్కన ఉన్న 19, 21వ నంబర్ పిల్లర్లపైనా ప్రభావం పడినట్టు ప్రాజెక్టు ఇంజనీర్లు భావిస్తున్నారు.
నది అడుగు భాగం నుంచి వంతెన పైభాగం వరకు ఏర్పాటు చేసిన గోడలను పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తోంది.మంచిర్యాల ఈఎన్సీ వెంకటేశ్వర్లు ఆదివారం సాయంత్రం 6 గంటలకు మేడిగడ్డ బ్యారేజీ వద్దకు వచ్చారు. బ్యారేజీ కాంట్రాక్టు సంస్థ ఎల్అండ్ టీ ప్రతినిధులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. 20వ నంబర్ పిల్లర్ల ఫీట్ మేర కుంగిపోయిందని ఈఎన్సీ ప్రకటించారు. ‘‘బ్యారేజీలో నీళ్లు ఉన్నందున ఇప్పుడే ఏమీ చెప్పలేం. త్వరలోనే ప్రమాదానికి గల కారణాలు వెల్లడిస్తాం. ఇప్పటికే ఇంజనీరింగ్ టీమ్‌తో పాటు ఎల్అండ్ టీ ఎక్స్పర్ట్స్టీమ్వచ్చింది. నీటి నిల్వ తగ్గగానే ప్రమాదంపై విచారణ చేపడతాం. ప్రమాదం జరిగిన సమయంలో బ్యారేజీలో 10 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. 20వ పిల్లర్సమీప గేట్లను మూసి మిగతా గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నాం” అని తెలిపారు. బ్యారేజీ నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు లోపించడం వల్లే ప్రమాదం జరిగిందా? అని మీడియా ప్రశ్నించగా.. ఈఎన్సీ సమాధానం చెప్పకుండా దాటవేశారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పి వెళ్లిపోయారు. అయితే మీడియాను మాత్రం అక్కడికి అనుమతించడం లేదు.