వి.రామారావు, సీహెచ్ విద్యాసాగర్ రావు, బండారు దత్తాత్రేయ, కంభం పాటి హరిబాబు, నల్లు ఇంద్రసేనారెడ్డి..ఈ నేతలందరికీ ఒక పోలిక ఉంది. వీరంతా భారతీయ జనతాపార్టీలో కీలక నేతలుగా ఎదిగారు. తర్వాత వీరంతా గవర్నర్లుగా నియమితులయ్యారు. తాజాగా బీజేపీ సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి త్రిపుర గవర్నర్ అయ్యారు. త్రిపుర గవర్నర్గా బీజేపీ నల్లు ఇంద్రసేనారెడ్డిని నియమితులు కావడంతో బీజేపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తనను త్రిపుర గవర్నర్ గా నియమించిన తర్వాత తొలిసారి నల్లు ఇంద్రసేనారెడ్డి మీడియాతో మాట్లాడారు. త్రిపుర ప్రభుత్వం నుంచి ఉదయం ఫోన్ వచ్చిందన్నారు. బీజేపీలో ఉన్న వారికి గుర్తింపు వస్తుందన్నారు. గవర్నర్ గా నియమించడం పట్ల ఇంద్రసేనారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తనకు వచ్చిన ఈ గుర్తింపు మలక్ పేట ప్రజలకు దక్కుతుందన్నారు. మలక్ పేట ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కోసం పాటుపడతానన్నారు. తనకు ఈ అవకాశం కల్పించిన ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, నడ్డాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
నల్లు ఇంద్రసేనా రెడ్డి తెలంగాణలోని సూర్యాపేట జిల్లాకు చెందిన వారు. ఆయన గతంలో మలక్పేట నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కూడా నల్లు ఇంద్రసేనా రెడ్డి పనిచేశారు. తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నేతగా కొనసాగుతున్నారు. కాగా, ఇప్పటికే తెలంగాణకు చెందిన బీజేపీ నేతలు గవర్నర్లుగా బాధ్యతలు నిర్వర్తించారు. సీహెచ్ విద్యాసాగర్ రావు మహారాష్ట్ర గవర్నర్గా పనిచేశారు. ప్రస్తుతం హర్యానా గవర్నర్గా బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ పనిచేస్తున్నారు. తాజాగా, ఇంద్రసేనా రెడ్డి గవర్నర్గా నియామకం కావడం గమనార్హం. ఏపీ బీజేపీకి చెందిన కంభంపాటి హరిబాబు ఇటీవల మిజోరాం గవర్నర్గా నియమితులైన విషయం తెలిసిందే.
ఇంద్రసేనారెడ్డి సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం గానుగబండ గ్రామంలో నల్లు రాంరెడ్డి, హనుమాయమ్మ దంపతులకు జన్మించారు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి 1972లో ఎంఎస్సి పూర్తి చేశారు. వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటీ నుంచి 1975లో ఎం.ఫీల్ పూర్తి చేశారు. ఇంద్రసేనారెడ్డి విద్యార్థి దశ నుంచి రాజకీయాల పట్ల ఆశక్తితో 1980లో భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆయన 1983, 1985, 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మలక్పేట్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, 1996, 2004లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ లోకసభ నియోజకవర్గం నుంచి, 2009లో మల్కాజ్గిరి లోకసభ నియోజకవర్గం నుంచి 2014లో భువనగిరి లోకసభ నియోజకవర్గం నుంచి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.
ఇంద్రసేనా రెడ్డి బీజేపీలో జాతీయ కార్యవర్గ సభ్యుడిగా, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పని చేశారు. 2022లో రాష్ట్రంలో బీజేపీ చేరికలు, సమన్వయ కమిటీ ఛైర్మన్గా ఇంద్రసేనా రెడ్డి వ్యవహరించారు. పదవులు కోసం బీజేపీ నేతలు పనిచేయరని, పనిచేసే నేతలకు పదవులు దానంతట అవే వస్తాయంటున్నారు బీజేపీ నేతలు. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రాగానే విధేయత కలిగిన వారిని గవర్నర్లుగా నియమిస్తోంది. తాజాగా తెలంగాణ ఎన్నికల వేళ ఇంద్రసేనారెడ్డి గవర్నర్ గా నియమితులు కావడంతో బీజేపీలో తగిన విధంగా గుర్తింపు దక్కిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఆయన అనుచరులు.