తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ కొత్త హామీలు తెరమీదకు వస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ విజయభేరి సభలో ప్రకటించిన ఆరు గ్యారెంటీలతో పాటుగా రైతు, యువత, దళిత డిక్లరేషన్లలోనూ ఆకర్షణీయమైన హామీలను ప్రకటించింది టీపీసీసీ.
రాష్ట్రంలోని విద్యార్థులను ఆకట్టుకునేలా మరో హామీని తెరపైకి తెచ్చింది. రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికీ ఉచితంగా ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది. గాంధీభవన్‌లో సమావేశమైన టీపీసీసీ మ్యానిఫెస్టో కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో డ్రైవర్లకు ఉపయోగపడేలా ప్రత్యేకంగా ఒక సంక్షేమ పథకాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. ఆటో డ్రైవర్ల సంఘాలతో సమావేశమై దీనికి సంబంధించి ఫీడ్ బ్యాక్‌ను కమిటీ తీసుకోనుంది. కమిటీ చైర్మన్ శ్రీధర్‌బాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కమిటీ సభ్యులుగా ఉన్న ఎమ్మెల్యే సీతక్క, మాజీ మంత్రులు సంభాని చంద్రశేఖర్, ప్రసాద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో ఇప్పటి వరకు వివిధ వర్గాల నుంచి వచ్చిన సూచనలు, ప్రతిపాదనలను సమీక్షించారని తెలిసింది. అక్టోబరు 2 నుంచి జిల్లాల పర్యటన నిర్వహించాలని కమిటీ సభ్యులు నిర్ణయించారు. 2న ఉదయం ఆదిలాబాద్, సాయంత్రం నిజామాబాద్ జిల్లాల్లో కమిటీ పర్యటించనుంది. కాగా.. సీఆర్పీఎఫ్ రిటైర్డ్ జవాన్లు శుక్రవారంటీపీసీసీ మ్యానిఫెస్టో కమిటీని కలిసి వారి సమస్యలు, పరిష్కారానికి మ్యానిఫెస్టోలో పెట్టాల్సిన అంశాలను కమిటీకి సమర్పించారు.తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే తొలి కేబినెట్ సమావేశంలోనే ఈ హామీలను నెరవేరుస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు. మహిళల కోసం మహాలక్ష్మి పథకాన్ని స్వయంగా సోనియా గాంధీ ప్రకటించారు.
కాంగ్రెస్ ప్రకటించిన ఆరు హామీలు ఏంటంటే..
ఇందిరమ్మ ఇండ్లు: ఈ హామీ కింద ఇల్లు లేని వారికి రూ.5 లక్షలు ఇంటి నిర్మాణానికి అందజేస్తారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పోరాడిన వారికి 250 చదరపు గజాల ఇల్లు
మహాలక్ష్మి: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) బస్సుల్లో మహిళలకు నెలకు రూ.2,500, గ్యాస్ సిలిండర్లు రూ.500, ఉచిత బస్సు ప్రయాణం.
గృహజ్యోతి: అన్ని గృహాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్
యువ వికాసం: కళాశాలలో విద్యకు రూ.5 లక్షల సహాయం, కోచింగ్‌కు ఆర్థిక సహాయం.
చేయూత: వృద్ధులకు రూ.4,000 నెలవారీ పింఛను, రూ.10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా.
రైతు భరోసా: రైతులకు ఏటా రూ.15,000, వ్యవసాయ కూలీలకు రూ.12,000, వరి పంటలకు రూ.500 బోనస్.తాజాగా ప్రకటించిన విద్యార్ధులకు ఉచిత ఇంటర్నెట్ పథకం ఎలా అమలుచేస్తారో చూడాలి. అయితే, ఈ పథకం విద్యార్దుల్ని ఆకట్టుకునే అవకాశం ఉందంటున్నారు.