YS Jagan Sharmila Family Dispute: జగన్‌ ఇప్పుడు ఫ్యామిలీ పద్మవ్యూహంలో చిక్కుకున్నారా అంటే.. అవుననే సమాధానం వినిపిస్తోంది. 2024 ఎన్నికలకు ముందు నుంచే కుటుంబంలో విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఆస్తుల వ్యవహారంలో అన్నపై చెల్లి వైఎస్‌ షర్మిల ( Sharmila)పెద్ద యుద్ధమే చేశారు. 2014, 2019 ఎన్నికల్లో ‘మా అన్నను గెలిపించమని’ ప్రజలను కోరిన ఆమె.. ఆ తర్వాత ‘మా అన్న రాక్షసుడు, ఓడించండి’ అంటూ ఎన్నికల ప్రచారం చేశారు. పైగా, జగన్‌ను ( YS Jagan) జైలులో పెట్టించిన కాంగ్రెస్‌ పార్టీలో చేరి.. ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. అయితే, ఇదంతా పాత వ్యవహారం. కానీ గత కొన్ని రోజులుగా అన్న జగన్‌పై షర్మిల( Sharmila).. విమర్శల బాణాలను పెంచుతున్నారు. తన కుమార్తె వైఎస్‌ అంజలిరెడ్డి వివాహానికి బెంగళూరులోని యలహంక ప్యాలెస్‌ను ఇవ్వడానికి జగన్‌ ఒప్పుకోవడం లేదనే ఆరోపణలు చేస్తున్నారు. దీంతో ఇద్దరి మధ్య యుద్ధం తారస్థాయికి చేరుకుంది.

నవంబర్‌ 25న వివాహం.. కార్డులు ప్రింట్‌

వైఎస్‌ షర్మిలారెడ్డి, బ్రదర్‌ అనిల్‌ కుమార్‌ల రెండో సంతానం అంజలిరెడ్డి వివాహాన్ని అమెరికాలో స్థిరపడిన ప్రముఖ వైద్యుడు సోమల సుబ్బారెడ్డి కుమారుడు రఘురామ్‌రెడ్డితో నిశ్చయించారు. ఎంగేజ్‌మెంట్‌ను హైదరాబాద్‌లో ఎంతో సంబరంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మేనమామ అయిన జగన్‌ ( YS Jagan) హాజరు కాలేదు. రాజకీయ ఘర్షణల నేపథ్యంలో కుటుంబ వేడుకకు రాలేదని అప్పట్లో వైసీపీ నేతలు బహిరంగంగానే చెప్పారు. అయితే, ఇప్పుడు వివాహాన్ని బెంగళూరులోని యలహంక ప్యాలెస్‌లో నిర్వహించాలని షర్మిల నిర్ణయించుకున్నారు. నవంబర్‌ 25వ తేదీన తన కుమార్తె వివాహం యలహంక ప్యాలెస్‌లో జరగనున్నట్లు ఆహ్వాన పత్రికలను సైతం ముద్రించారు. బంధుమిత్రులు, ముఖ్యమంత్రులు, రాజకీయ నేతలకు ఆహ్వానాలు పంపించారు. నూతన వధూవరులను ఆశీర్వదించాలని అందరినీ ఆహ్వానించిన షర్మిల.. తన అన్న, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మాత్రం ఆహ్వాన పత్రిక ఇవ్వలేదు.

యలహంక ప్యాలెస్‌లో పెళ్లికి నో చెప్పిన జగన్‌

బెంగళూరులోని యలహంక ప్యాలెస్‌లో ( Bengaluru Palace) వివాహం చేయడానికి జగన్‌ నో చెప్పినట్లు సమాచారం. భద్రతా కారణాల దృష్ట్యా ఒప్పుకునేది లేదంటూ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు, రాజకీయ నేతలకు ఆహ్వాన పత్రికలు ఇచ్చిన తర్వాత.. యలహంకలో పెళ్లి చేయడానికి జగన్‌ ( YS Jagan) అంగీకరించలేదు. పైగా, హైదరాబాద్‌లోని లోటస్‌ పాండ్‌ నివాసంతో పాటు.. మరేదైనా ఫంక్షన్‌ హాల్‌లో వివాహ వేడుక జరుపుకోవాలని సూచించినట్లు సమాచారం. దీంతో మరోసారి షర్మిల, జగన్‌ మధ్య మాటల యుద్ధం అంతర్గతంగా తారస్థాయికి చేరుకుంది. సొంత మేనకోడలి వివాహానికి భద్రతా కారణాలు చెప్పడం ఏమిటని షర్మిల ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. తన తండ్రి, దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి యలహంకలో తనకు కూడా వాటా ఉందని చెప్పారని.. అక్కడ తన కోసం కూడా నివాసాన్ని నిర్మించారని ఆమె గుర్తు చేసినట్లు తెలుస్తోంది. యలహంక నివాసంలో షర్మిలకు వాటా ఉందనే విషయాన్ని విజయలక్ష్మి సైతం జగన్‌కు చెప్పినట్లు సమాచారం. కానీ, రాజకీయంగా తనను విభేదించిన షర్మిల కుమార్తె అంజలిరెడ్డి వివాహాన్ని తన ఇంటి ఆవరణలో నిర్వహించడానికి వీల్లేదని జగన్‌ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

మరింత ముదురుతున్న ఆస్తుల వివాదం

2024 ఎన్నికల తర్వాత వైఎస్‌ కుటుంబంలో విభేదాలు రోజురోజుకూ ముదురుతున్నాయి. విజయలక్ష్మి పేరుతో ఉన్న సరస్వతి సిమెంట్స్‌ కంపెనీ షేర్లను కుమార్తె షర్మిలకు ( Sharmila) బదలాయించారు. దీనిపై ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించిన జగన్‌.. ఆ వాటాలు తనవని, వాటాల బదలాయింపు కుదరదని నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ ఎదుట వాదించారు. చివరకు ఎన్‌సీఎల్‌టీ ఈ వ్యవహారాన్ని తాత్కాలికంగా వాయిదా వేసింది. అంతేకాకుండా, గతంలో షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహానికి జగన్‌ వెళ్లినా.. మొక్కుబడిగా పలకరించారని కుటుంబానికి సన్నిహితంగా ఉన్నవారు చెబుతున్నారు. ఇప్పుడు అంజలిరెడ్డి వివాహానికి సంబంధించి కనీసం ఆహ్వానం కూడా ఇవ్వలేదని జగన్‌ సన్నిహితులు చెప్పుకుంటున్నారు. అయితే, నవంబర్‌ 25వ తేదీన యలహంకలోని జగన్‌ నివాస ప్రాంగణంలో షర్మిల కుమార్తె వివాహం జరుగుతుందా? లేదా? అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కుటుంబ సభ్యులు ఈ వ్యవహారంపై రాజీ కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.