YS Jagan family dispute: యలహంక, స్థానిక ఎన్నికలు.. జగన్‌లో భయం.. భయం!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ పరిస్థితి ఇప్పుడు ముందుకెళ్తే గొయ్యి.. వెనక్కి వస్తే నుయ్యి అన్నట్లుగా తయారైంది. ఓ వైపు స్థానిక ఎన్నికలు, మరోవైపు సొంత చెల్లి వైఎస్ షర్మిల వ్యవహారం తలనొప్పిగా మారాయి. ఎన్నికలపై ఫోకస్ పెంచుదామనుకున్న సమయంలో షర్మిల కుమార్తె పెళ్లి వేదికకు సంబంధించిన వ్యవహారం అడ్డంకిగా మారింది. దీంతో కేవలం ప్రెస్‌మీట్ పెట్టి తిరిగి బెంగళూరుకు వెళ్లిపోతున్నారు. వరుస పరిణామాల నేపథ్యంలో జగన్‌లో అసహనం రోజురోజుకూ పెరుగుతోందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా బెంగళూరు శివారులోని యలహంక వ్యవహారంలో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు.

23 ఎకరాల్లో జగన్ ప్యాలెస్ నిర్మాణం

బెంగళూరులోని అంతర్జాతీయ విమానాశ్రయానికి అతి సమీపంలో యలహంకలో 23 ఎకరాల్లో జగన్ ప్యాలెస్‌ను నిర్మించుకున్నారు. ఇందులో షర్మిలకు కూడా భాగం ఉందని వైఎస్ కుటుంబీకులు చెబుతున్నారు. అక్రమాస్తుల కేసులో జగన్ జైలుకు వెళ్లినప్పుడు జగన్ యలహంక ప్యాలెస్ పేరుతో ఈ వ్యవహారం మార్మోగిపోయింది. వందలాది గదులతో విలాసవంతమైన భవనాన్ని నిర్మించుకున్నారని అప్పట్లో కాంగ్రెస్, టీడీపీ నేతలు ఆరోపించారు. 2014 ఎన్నికల సమయంలో టీడీపీ నేతలు సైతం తమ ప్రచారంలో యలహంక ప్యాలెస్ గురించి ప్రస్తావించారు. కానీ జగన్ మాత్రం 2019 ఎన్నికలకు ముందు వరకు హైదరాబాద్‌లోని లోటస్ పాండ్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు రాకపోకలు సాగించారు. అయితే, 2024 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన తర్వాత జగన్ బెంగళూరు నుంచి తాడేపల్లికి రాకపోకలు సాగిస్తున్నారు. తాడేపల్లిలో పార్టీ కార్యక్రమాలను ముగించుకుని నేరుగా యలహంకలోని నివాసానికి వెళ్తున్నారు.

షర్మిల కుమార్తె పెళ్లి కార్డుతో బట్టబయలు

ఇన్నాళ్లూ యలహంక ప్యాలెస్ గురించి ఆంధ్రప్రదేశ్ ప్రజలు వినడమే తప్ప, ఇప్పటివరకు చూడలేదు. అయితే, యలహంక ప్యాలెస్ రహస్యం బయటపడాలనే ఉద్దేశంతోనే వైఎస్ షర్మిల తన కుమార్తె అంజలి రెడ్డి వివాహాన్ని బెంగళూరులోని ఆ ప్యాలెస్ వేదికగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. బెంగళూరులోని నివాసంలో తనకు వాటా ఉందని, తల్లి ద్వారా రాయబారం పంపిన షర్మిల.. పెళ్లిని అక్కడే చేస్తానని పట్టుబట్టినట్లు తెలుస్తోంది. అంజలి వివాహాన్ని యలహంకలోని నివాసంలో నిర్వహిస్తామని పెళ్లి కార్డుల్లో ముద్రించారు. కానీ మాజీ ముఖ్యమంత్రి జగన్ మాత్రం పెళ్లిని యలహంక ప్యాలెస్‌లో నిర్వహించడానికి వీల్లేదంటూ స్పష్టం చేశారు. పైగా, భద్రతాపరమైన సమస్యలు వస్తాయని, దయచేసి పెళ్లి వేదికను మార్చుకోవాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ద్వారా లేఖను విడుదల చేయించారు. యలహంక ప్యాలెస్‌లో వైఎస్ షర్మిల తన కుమార్తె వివాహాన్ని నిర్వహించి, అక్కడి ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేయించాలనే ఉద్దేశంతోనే అక్కడ వివాహ వేదికను ఏర్పాటు చేయించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

స్థానిక సంస్థలపై ఫోకస్ చేయలేకపోతున్న జగన్

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను కూటమి ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. బీజేపీ, జనసేన, టీడీపీ మధ్య సీట్ల సర్దుబాటు పూర్తవడంతో నామినేషన్ల ఘట్టం ముగిసింది. కానీ వైసీపీ నేతలు మాత్రం కొన్ని ప్రాంతాల్లో నామినేషన్లు దాఖలు చేయలేకపోయారు. పైగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ఎన్నికలను తేలిగ్గా తీసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జగన్‌కు స్థానిక సంస్థల ఎన్నికల కంటే యలహంక ప్యాలెస్ భయమే ఎక్కువగా పట్టుకుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అందుకే మొక్కుబడిగా రెండు ప్రెస్‌మీట్లు పెట్టి నేరుగా బెంగళూరుకు వెళ్లిపోతున్నట్లు వైసీపీలో చర్చ జరుగుతోంది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ పెంచితే, నవంబర్ 25 నాటికి వైఎస్ షర్మిల కుమార్తె పెళ్లి అక్కడ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. యలహంకలో వివాహం జరగకుండా వేరే ప్రాంతంలో వైఎస్ అంజలి వివాహం జరిగేలా జగన్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. కుటుంబ సభ్యుల ద్వారా ఇప్పటికే రాయబారాలు నడిపినట్లు తెలుస్తోంది.

రూ.452 కోట్లతో రుషికొండలో యలహంక మోడల్ హౌస్

వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విశాఖపట్నంలోని రుషికొండపై రూ.452 కోట్లతో విలాసవంతమైన నివాస, కార్యాలయ భవనాలు ఏడింటిని నిర్మించారు. వాటిలో ప్రత్యేకంగా నివాస భవనాలు మూడున్నాయి. వాటిలో పన్నెండు బెడ్‌రూమ్‌లు ఉన్నాయి. యలహంక ప్యాలెస్ మాదిరిగానే రుషికొండలోనూ భవనాన్ని నిర్మించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోసారి ముఖ్యమంత్రి అయితే విశాఖపట్నం నుంచి పరిపాలన సాగించాలని జగన్ భావించినప్పటికీ, ఎన్నికల్లో ఓటమి పాలవడంతో ఇప్పుడు తాడేపల్లి నుంచి బెంగళూరుకు తరచూ ప్రయాణాలు చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.