Tollywood Actors Divorces: సినిమాల్లో ఓ సన్నివేశానికి ప్యాకప్ చెప్పినంత సులభంగా నిజ జీవితంలో బంధాలకు కట్ చెప్పలేరు. కానీ, ప్రేమించి పెళ్లి చేసుకున్న కొందరు సినీ ప్రముఖుల జీవితాల్లో మాత్రం అదే జరిగింది. తెరపై తమ కెమిస్ట్రీతో ప్రేక్షకులను కట్టిపడేసిన జంటలు.. నిజ జీవితంలోనూ ఒక్కటై కొత్త ప్రయాణం ప్రారంభించారు. తొలినాళ్లలో ఎంతో అన్యోన్యంగా కనిపిస్తూ అభిమానులకు ఆదర్శంగా నిలిచారు. కానీ, కాలం గడిచేకొద్దీ మనస్పర్థలు, వ్యక్తిగత అభిప్రాయ భేదాలు వారి మధ్య దూరాన్ని పెంచాయి. చివరకు కలిసి నడవాల్సిన జీవితానికి విడివిడిగా కట్ చెప్పేశారు. ఒకప్పుడు పెళ్లి వార్తలతో సంచలనం సృష్టించిన ఈ జంటలు.. ఆ తర్వాత విడాకుల ప్రకటనలతోనూ వార్తల్లో నిలిచారు. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం, సినీ నటుడు పవన్ కళ్యాణ్, ఆయన భార్య అన్నా లెజ్ నోవా విడిపోయినట్లు సంయుక్త ప్రకటన చేయడం చర్చనీయాంశంగా మారింది.

అక్కినేని నాగచైతన్య- సమంత

టాలీవుడ్‌లో అభిమానులను అత్యంత ఆశ్చర్యానికి గురిచేసిన విడాకుల వ్యవహారాల్లో నాగచైతన్య (Naga Chaitanya), సమంత (Samantha Ruth Prabhu) జంట ఒకటి. ‘ఏం మాయ చేసావే’ సినిమాతో తెరపై మ్యాజిక్ చేసిన వీరిద్దరూ ఆ తర్వాత ప్రేమలో పడ్డారు. కొన్నేళ్ల ప్రేమ ప్రయాణం అనంతరం 2017లో గోవాలో ఘనంగా వివాహం చేసుకున్నారు. మజిలీ సినిమాలో భార్యాభర్తలుగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నిజ జీవితంలోనూ ఎంతో అన్యోన్యంగా కనిపించేవారు. అయితే నాలుగేళ్ల వైవాహిక జీవితం తర్వాత 2021 అక్టోబర్‌లో విడిపోతున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. తమ నిర్ణయాన్ని గౌరవించాలని అభిమానులను కోరారు. ఆ తర్వాత నాగచైతన్య శోభితను వివాహం చేసుకోగా.. సమంత బాలీవుడ్ దర్శకుడు రాజ్‌ నిడుమోరును వివాహం చేసుకున్నారు.

మంచు మనోజ్- ప్రణతి రెడ్డి

మంచు కుటుంబం నుంచి హీరోగా వచ్చిన మంచు మనోజ్ (Manchu Manoj) కూడా వైవాహిక జీవితంలో ఒడిదొడుకులను ఎదుర్కొన్నారు. 2015లో ప్రణతి రెడ్డిని (Pranathi Reddy) వివాహం చేసుకున్న ఆయన.. కొంతకాలానికే విభేదాలు ఎదుర్కొన్నారు. చివరకు 2019లో విడాకులు తీసుకున్నట్లు స్వయంగా ప్రకటించారు. తమ మధ్య విభేదాలు, బాధాకరమైన పరిస్థితులు చోటుచేసుకున్నాయని.. అన్ని విషయాలను ఆలోచించిన తర్వాత విడివిడిగా జీవించాలని నిర్ణయించుకున్నామని అప్పట్లో వెల్లడించారు. అనంతరం మనోజ్ భూమా మౌనికా రెడ్డిని రెండో వివాహం చేసుకున్నారు. ఆమెకు మొదటి వివాహం ద్వారా కలిగిన కుమారుడిని కూడా మనోజ్ తన సొంత బిడ్డగా స్వీకరించారు. భూమా మౌనికకు గతంలో ఓ వ్యక్తితో వివాహం జరిగింది. మంచు మనోజ్‌ను ప్రేమించి.. భర్తకు విడాకలు ఇచ్చి మరీ వివాహం చేసుకున్నారు.

ధనుష్- ఐశ్వర్య రజనీకాంత్

కోలీవుడ్‌లో స్టార్ కపుల్‌గా గుర్తింపు పొందిన ధనుష్ (Dhanush), ఐశ్వర్య రజనీకాంత్ (Aishwaryaa Rajinikanth) జంట విడాకుల నిర్ణయం కూడా అప్పట్లో తీవ్ర చర్చకు దారితీసింది. 2022లో విడిపోతున్నట్లు ప్రకటించిన వీరు.. పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. సుదీర్ఘ వైవాహిక ప్రయాణం తర్వాత కలిసి కొనసాగడం సాధ్యం కాదని నిర్ణయించుకున్నారు. చివరకు 2024లో చెన్నై ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేయడంతో 18 ఏళ్ల వైవాహిక బంధానికి తెరపడింది.

విడాకులతో సంచలనంగా మారిన హీరోలు

ఇలా వెండితెరపై ప్రేమకథలకు కేరాఫ్‌గా నిలిచిన కొందరు సినీ జంటలు.. నిజ జీవితంలో మాత్రం తమ బంధానికి ప్యాకప్ చెప్పేశారు. ఒకప్పుడు పెళ్లి వేడుకలతో వార్తల్లో నిలిచిన వారు.. ఆ తర్వాత విడాకుల ప్రకటనలతోనూ సంచలనంగా మారారు.