ZP ఛైర్మన్ అభ్యర్థిగా పరిటాల శ్రీరామ్
శ్రీసత్యసాయి జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థిగా ధర్మవరం టీడీపీ ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్ పేరును ప్రకటించింది. జెడ్పీ చైర్మన్‌గా పరిటాల శ్రీరామ్‌కు అధిష్ఠానం అవకాశం కల్పించింది. కదిరి నియోజకవర్గంలోని నల్లచెరువు జెడ్పీటీసీ స్థానం నుంచి పరిటాల శ్రీరామ్ పోటీ చేయనున్నారు.

Paritala Sriram: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కోలాహలంగా సాగుతోంది. ఇప్పటికే మున్సిపాలిటీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలకు కూటమి అభ్యర్థులు నామినేషన్లు వేస్తున్నారు. అటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల జాబితాను ఎప్పటికప్పుడు విడుదల చేస్తోంది. ఈ క్రమంలో శ్రీసత్యసాయి జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థిగా ధర్మవరం టీడీపీ ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్ పేరును ప్రకటించింది. జెడ్పీ చైర్మన్‌గా పరిటాల శ్రీరామ్‌కు అధిష్ఠానం అవకాశం కల్పించింది. కదిరి నియోజకవర్గంలోని నల్లచెరువు జెడ్పీటీసీ స్థానం నుంచి పరిటాల శ్రీరామ్ పోటీ చేయనున్నారు. కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌తో పాటు టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎం.ఎస్. రాజుతో కలిసి జెడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు.
ధర్మవరం సీటును ఆశించిన పరిటాల శ్రీరామ్(Paritala Sriram)
గత ఎన్నికల్లో ధర్మవరం ఎమ్మెల్యేగా పోటీ చేయాలని పరిటాల శ్రీరామ్ భావించారు. అయితే కూటమి పొత్తులో భాగంగా ధర్మవరం సీటును బీజేపీకి కేటాయించడంతో అక్కడి నుంచి సత్యకుమార్ పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన మంత్రివర్గంలో వైద్యారోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే రాజకీయంగా కొంతకాలంగా క్రియాశీలకంగా కనిపించని పరిటాల శ్రీరామ్‌కు అధిష్ఠానం జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థిగా అవకాశం ఇచ్చింది. మరోవైపు, పరిటాల శ్రీరామ్ తల్లి పరిటాల సునీత ప్రస్తుతం రాప్తాడు ఎమ్మెల్యేగా ఉన్నారు. 2014–2019 మధ్యకాలంలో పరిటాల సునీత రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. రాప్తాడులో ఎమ్మెల్యేగా సునీత ఉన్నప్పటికీ, రాజకీయ బాధ్యతలను శ్రీరామ్ చూసుకుంటారని పార్టీ నేతలు చెబుతుంటారు. అయితే 2019 ఎన్నికల్లో రాప్తాడు నుంచి పరిటాల శ్రీరామ్ పోటీ చేసి వైఎస్సార్సీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.
ధర్మవరం నియోజకవర్గానికి ఎందుకు వెళ్లారు..?
పరిటాల శ్రీరామ్ తండ్రి పరిటాల రవీంద్ర తొలుత ధర్మవరం నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఆ తర్వాత రాజకీయ సమీకరణాల్లో భాగంగా రాప్తాడు నియోజకవర్గానికి మారారు. ధర్మవరంలో పరిటాల కుటుంబానికి అనుచరులు ఉన్నారు. దీంతో గత ఎన్నికల్లో పరిటాల శ్రీరామ్ ధర్మవరం నుంచి పోటీ చేయాలని ఆశించారు. కానీ పొత్తులో భాగంగా ఆ స్థానాన్ని బీజేపీకి కేటాయించడంతో, ఆ పార్టీ అభ్యర్థి సత్యకుమార్‌కు మద్దతు ఇచ్చి ఆయన గెలుపునకు కృషి చేశారు. ప్రస్తుతం సత్యకుమార్ చంద్రబాబు కేబినెట్లో వైద్యారోగ్యశాఖ మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు మరోసారి తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం పరిటాల శ్రీరామ్‌కు జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థిగా అవకాశం కల్పించింది.
రాప్తాడులో నామినేషన్ సందర్భంగా ఘర్షణలు
రాప్తాడు మండల కేంద్రంలో ఎంపీటీసీ నామినేషన్ల సందర్భంగా టీడీపీ, వైఎస్సార్సీపీ నాయకుల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణలు జరిగాయి. వైఎస్సార్సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు వెళ్తున్న సమయంలో టీడీపీ నేతలు అడ్డగించి, నామినేషన్ పత్రాలను చించివేశారని వైఎస్సార్సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.


