Married for Municipal Chairperson Post: స్థానిక సంస్థల ఎన్నికల వేళ రిజర్వేషన్లు ప్రకటించిన దివ్యముహూర్తం చూసుకుని పెళ్లి పీటలెక్కిందో జంట. మొన్నటిదాకా ఆయన నిలబడాలనుకున్నాడు. కానీ సీటు బీసీ మహిళకు రిజర్వు కావటంతో క్షణం ఆలస్యం చేయకుండా వధువు కుటుంబాన్ని ఒప్పించి మెళ్లో తాళి కట్టేశాడు. మన్యం జిల్లాలో ఎన్నికల్లో పోటీనే లక్ష్యంగా జరిగిన కళ్యాణం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరుకు చెందిన తెలుగుదేశం నాయకుడు, మాజీ కౌన్సిలర్‌ వైకుంఠపు హర్షవర్ధన్‌ మున్సిపల్‌ ఛైర్మన్‌గా పోటీచేయాలనుకున్నారు. అయితే మున్సిపల్‌ ఛైర్మన్ పదవి బీసీ మహిళకు కేటాయిస్తూ రిజర్వేషన్‌ ఖరారైంది. తనకు పోటీచేసే అవకాశం రాకపోవటంతో తన భార్యనైనా బరిలో నిలబెట్టాలనుకున్న హర్షవర్ధన్‌ రిజర్వేషన్‌ ఖరారైన 24 గంటల్లోపే వెంటనే పెళ్లి ముహూర్తం పెట్టేసుకున్నారు.

తను ప్రేమించిన మంజీరను ఆమె కుటుంబసభ్యులను ఒప్పించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. ఛైర్‌పర్సన్‌ ఎన్నిక ప్రత్యక్ష పద్దతిలో జరగబోతుండటంతో.. తన సహధర్మచారిణిని ఎన్నికల్లో నిలబెట్టి గెలిపించుకోవాలనుకుంటున్నాడు. పెళ్లిముచ్చట అయిపోవటంతో సాలూరు మున్సిపల్‌ ఛైర్మన్ టికెట్‌ తన భార్యకు దక్కించుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అదృష్టం కలిసొస్తే భార్యామణి రేప్పొద్దున సాలూరు ప్రథమ పౌరురాలు అయిపోయినా ఆశ్చర్యపడాల్సిన పన్లేదు.