Manipur Violence Latest: మూడేళ్లు గ‌డిచినా మంట‌లు ఆర‌లేదు. మణిపూర్ గిరిజ‌న తెగ‌ల అంత‌ర్యుద్ధంతో మండిపోతోంది. కిడ్నాప్‌లు, గృహ‌ద‌హ‌నాలు, ప్ర‌తీకార హ‌త్య‌ల‌తో అట్టుడుకుతోంది. హింస‌ను అదుపుచేయ‌లేక భ‌ద్ర‌తాబ‌ల‌గాలు చేతులెత్తేస్తున్నాయి. కుకీలు, మైతేయ్‌ల ఘ‌ర్ష‌ణ‌ల‌తో త‌గ‌ల‌బ‌డుతున్న మ‌ణిపూర్‌లో ఇప్పుడు మ‌రో ముప్పు ముంచుకొచ్చింది. నాగాల రూపంలో మ‌రో ఉత్పాతం వ‌చ్చిప‌డింది. కొండ‌ప్రాంతాల‌కు విస్త‌రించిన హింస మార‌ణ‌హోమానికి దారితీస్తోంది.

మ‌ధ్య‌లో కొన్నాళ్లు హింస త‌గ్గుముఖం ప‌ట్టినా నివురుగ‌ప్పిన నిప్పులా ఉన్న మ‌ణిపూర్‌లో మళ్లీ విద్వేష మంట‌లు రాజుకున్నాయి. సెప్టెంబ‌రు నెల‌లో జ‌రిగిన హింస‌లో 19మంది ప్రాణాలు కోల్పోయారు. అక్టోబ‌రులోనూ దాడులు ప్ర‌తిదాడుల‌తో అట్టుడుకుతున్న మ‌ణిపూర్‌లో ఒక్క‌రోజే న‌లుగురు ప్రాణాలు కోల్పోయారు. స‌రిగ్గా మూడేళ్ల‌క్రితం 2023 మే3న మొద‌లైన అల్ల‌ర్లు ఇప్ప‌టికీ కొన‌సాగుతున్నాయి. అప్ప‌ట్లో ఓ వ‌ర్గానికి చెందిన మ‌హిళ‌ల‌ను న‌గ్నంగా ఊరేగించ‌డం దేశ‌వ్యాప్తంగా తీవ్ర సంచ‌ల‌నం సృష్టించింది.

కుకీ, మైతేయ్ తెగ‌ల మ‌ధ్య మొద‌ట్లో ఘ‌ర్ష‌ణ‌లు మొద‌లైతే.. ఇప్పుడు కొండ ప్రాంతాల్లో కుకీలు, నాగాల మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు చోటుచేసుకుంటున్నాయి. ఒక్క ఈ ఏడాదిలోనే ఇప్ప‌టిదాకా వందిమందికి పైగానే మ‌ణిపూర్ హింస‌కు
బ‌ల‌య్యారు. రోడ్డ దిగ్బంధంతో మెరుపుదాడుల‌కు దిగుతున్నారు. ప్ర‌భుత్వ వైఫ‌ల్యం తెగ‌ల మ‌ధ్య మంట‌లు రాజేసింది. పాల‌కులు కుదిర్చిన ఒప్పందాల‌కు విలువ లేకుండా పోయింది. ఘ‌ర్ష‌ణ‌ల్లో ఇప్ప‌టికే 50వేల‌మంది నిరాశ్ర‌యుల‌య్యారు. వారిలో చాలామంది ఇప్ప‌టికీ శ‌ర‌ణార్ధ శిబిరాల్లోనే ఉంటున్నారు.