Janasena Office Job Fraud: జనసేన పార్టీ ఆఫీసులో తాను పని చేస్తున్నానని.. అక్కడ తాను ఎంత చెబితే అంత అంటూ అమాయకులను ఉద్యోగాల పేరుతో మోసం చేసిన భారీ మొత్తంలో డబ్బులు వసూళ్ల వ్యవమారం ఇప్పుడుసంచలనంగా మారింది. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం పేరును ఉపయోగించుకుంటూ ఏలూరు, తణుకు ప్రాంతాలకు చెందిన సుమారు 20 మంది నుంచి దాదాపు రూ.7 కోట్ల వరకు వసూలు చేసినట్లు ఫిర్యాదు అందడం రాజకీయ, సామాజిక వర్గాల్లో కలకలం రేపుతోంది. ధరణి అనే వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురిని నమ్మించి భారీ మొత్తంలో నగదు వసూలు చేసినట్లు జనసేన కేంద్ర కార్యాలయం నుంచి మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు అందింది. ముఖ్యంగా ఏలూరు, తణుకు ప్రాంతాల్లో నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని, ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పించగలమని నమ్మబలికి డబ్బులు తీసుకున్నట్లు బాధితులు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

జనసేన నేతల పేర్ల దుర్వినియోగం?

ఈ వ్యవహారంలో కళ్యాణం శివ శ్రీనివాస్, కోట రుక్మిణి పేర్లను ఉపయోగించుకుని వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జనసేన పార్టీ కార్యాలయం పేరును కూడా ఉపయోగించుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. తమ పేర్లను దుర్వినియోగం చేస్తూ ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేసిన వ్యవహారంపై జనసేన నేతలు కేకే, కోట రుక్మిణి మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది. దాదాపు 20 మంది నుంచి రూ.7 కోట్ల మేర వసూళ్లు జరిగినట్లు వస్తున్న ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. నిరుద్యోగుల ఆశలను ఆసరాగా చేసుకుని ఇలాంటి మోసాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. పరారీలో ఉన్నవారి కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఏర్పాటు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.

ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండండి: జనసేన

జనసేన పార్టీ నాయకుల పేర్లు చెప్పి ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను మోసం చేసే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని మంగళగిరి పార్టీ కార్యాలయంలో పనిచేస్తున్న నాయకులు సూచించారు. కొందరు వ్యక్తులు పార్టీ నేతలతో తమకు పరిచయాలు ఉన్నాయని, వారి పలుకుబడితో ప్రభుత్వ లేదా ప్రైవేటు ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను నమ్మించే ప్రయత్నం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు. ఇలాంటి వ్యక్తుల మాటలు నమ్మి ఎవరూ మోసపోవద్దని, ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఎవరైనా డబ్బులు డిమాండ్ చేసినా, వసూలు చేసినా వెంటనే అప్రమత్తమై సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. జనసేన పార్టీ నాయకుల పేర్లను దుర్వినియోగం చేస్తూ నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసే మోసగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

‘కొనుక్కుంటే ఉద్యోగాలు రావు, ప్రతిభతోనే వస్తాయి’

ఉద్యోగాలు అనేవి డబ్బులు చెల్లించి కొనుగోలు చేసేవి కావని, అభ్యర్థుల విద్యార్హతలు, నైపుణ్యం, ప్రతిభ ఆధారంగానే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని స్పష్టం చేశారు. ఉద్యోగాల కోసం ఎవరినీ నమ్మి డబ్బులు ఇవ్వవద్దని, ఇలాంటి మోసపూరిత ప్రచారాలకు దూరంగా ఉండాలని సూచించారు. నిరుద్యోగ యువత ఈ విషయాన్ని గుర్తించి అప్రమత్తంగా వ్యవహరించాలని మంగళగిరి కార్యాలయ వర్గాలు ప్రకటనలో పేర్కొన్నట్లు సమాచారం.