Hyderabad Water Crisis: హైదరాబాద్‌ మహానగరాన్ని ఇప్పుడు ఎండలు మాత్రమే కాదు.. నీటి కష్టాలు కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఒకప్పుడు ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, ఉద్యోగాల కోసం నగరానికి వచ్చిన యువతతో కళకళలాడిన మాదాపూర్‌, గచ్చిబౌలి, హైటెక్‌ సిటీ, కొండాపూర్‌ ప్రాంతాల్లో ఇప్పుడు నీటి ట్యాంకర్ల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. హాస్టళ్లలో తాగడానికి, వంట చేసుకోవడానికి, స్నానాలు చేయడానికి కూడా నీరు అందని దుస్థితి ఏర్పడుతోంది. ఈ ఏడాది వర్షాలు తక్కువగా కురవడంతో చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలోకి చేరాల్సిన నీటి ప్రవాహాలు తగ్గాయి. మరోవైపు భూమిలోకి ఇంకాల్సిన వర్షపు నీరు తగ్గడంతో భూగర్భ జలాలు కూడా అడుగంటుతున్నాయి. ఫలితంగా బోర్లు ఎండిపోవడం, ట్యాంకర్లపై ఆధారపడటం పెరుగుతోంది. గత ఏడాది సెప్టెంబర్‌లో భూమికి 4.73 మీటర్ల లోతులో ఉన్న నీటిమట్టం.. ఈ ఏడాది అదే నెలలో 11.58 మీటర్ల లోతుకు పడిపోయింది.

నీటి సరఫరాపై పెరుగుతున్న ఒత్తిడి

హైదరాబాద్‌ నీటి సరఫరా వ్యవస్థపై కూడా తీవ్ర ఒత్తిడి నెలకొంది. నగర విస్తీర్ణం, జనాభా, వాణిజ్య అవసరాలు పెరుగుతున్న కొద్దీ నీటి డిమాండ్‌ కూడా భారీగా పెరిగింది. రోజుకు దాదాపు 150 ఎంజీడీల నీటి లోటు ఉన్నట్లు అంచనా. కృష్ణా, గోదావరి ప్రాజెక్టుల నుంచి నీటి సరఫరా కొనసాగుతున్నప్పటికీ, మంజీరా, సింగూరు, ఉస్మాన్‌సాగర్‌ వంటి జలాశయాలపై వర్షపాతం లోటు ప్రభావం కనిపిస్తోంది. రిజర్వాయర్లలో నిల్వలు తగ్గుతుండటం, స్థానికంగా భూగర్భ జలాలు అడుగంటడం కలిపి నగర నీటి సరఫరాకు సవాలుగా మారుతున్నాయి. దీంతో హైదరాబాద్‌ ఐటీ కారిడార్‌లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతోంది.

ఐటీ కారిడార్‌లో పరిస్థితి ఆందోళనకరం

గచ్చిబౌలి, మాదాపూర్‌, రాయదుర్గం, హైటెక్‌ సిటీ, కొండాపూర్‌ ప్రాంతాల్లో వేల సంఖ్యలో హాస్టళ్లు, పీజీలు, అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. వీటిలో నివసిస్తున్న లక్షలాది మంది ఉద్యోగులు, విద్యార్థుల అవసరాలను తీర్చడానికి ప్రతిరోజూ భారీ మొత్తంలో నీరు అవసరం ఉంది. ఇప్పుడు బోర్లు ఎండిపోవడంతో ప్రైవేట్‌ ట్యాంకర్లపైనే ఆధారపడాల్సి వస్తోంది. ట్యాంకర్లు సకాలంలో రాకపోతే హాస్టళ్లలో వంట చేయడం, బాత్రూమ్‌లు నిర్వహించడం, తాగునీరు అందించడం కూడా కష్టంగా మారుతోంది.

ఐటీ ఉద్యోగులకు వర్క్‌ఫ్రమ్‌ హోమ్..?

నీటి కొరత ప్రభావం ఇప్పుడు విద్యారంగంపైనా పడుతోంది. మాదాపూర్‌, హైటెక్‌ సిటీ పరిసరాల్లోని కొన్ని కార్పొరేట్‌ విద్యాసంస్థలు ఇప్పటికే తాత్కాలిక సెలవులు ప్రకటించాయి. తిరిగి కాలేజీలు ఎప్పుడు తెరుస్తారనే విషయాన్ని తర్వాత తెలియజేస్తామని, ఈలోగా ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తామని యాజమాన్యాలు చెబుతున్నాయి. ఇక హైదరాబాద్‌ ఐటీ కారిడార్‌లో దాదాపు ఐదు లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారనే అంచనాల నేపథ్యంలో మరో కీలక ప్రతిపాదన చర్చకు వస్తోంది. నీటి కొరత తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లోని ఐటీ సంస్థలు ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ అవకాశం కల్పిస్తే కార్యాలయాల్లో నీటి వినియోగాన్ని తగ్గించవచ్చనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.

డిసెంబర్‌లో నీటి కొరత తీవ్రం..!

వర్షపాతం లోటు, తగ్గుతున్న భూగర్భ జలాలు, పెరుగుతున్న ట్యాంకర్ల డిమాండ్‌ నేపథ్యంలో.. డిసెంబర్‌ నుంచి వేసవి ప్రారంభమయ్యే వరకు నీటి వినియోగం, అందుబాటులో ఉండే వనరుల మధ్య అంతరం పెరిగే ప్రమాదం ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న నిల్వలతో 2027 వేసవి వరకు నీటి సరఫరా కొనసాగించగలమని జలమండలి అధికారులు చెబుతున్నారు. నగరంలో పెరుగుతున్న నీటి అవసరాలు, తగ్గుతున్న స్థానిక జలవనరుల నేపథ్యంలో రాబోయే రోజుల్లో నీటి సరఫరా పరిస్థితి ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది