పురపోరులో సై అంటున్న తోడికోడళ్లు

Chintakayala family: నర్సీపట్నం రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. నర్సీపట్నం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది, మంత్రిగా పనిచేసిన చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రస్తుతం ఏపీ శాసనసభ స్పీకర్‌గా ఉన్నారు. అంతేకాకుండా, ఆయన కుమారుడు చింతకాయల విజయ్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఇప్పుడు చింతకాయల అయ్యన్నపాత్రుడి భార్య పద్మావతి సైతం నర్సీపట్నం మున్సిపల్ చైర్పర్సన్ పదవికి అభ్యర్థిగా ఉన్నారు. అయితే, ఆమెకు ప్రత్యర్థి ఎవరంటే.. చింతకాయల అయ్యన్నపాత్రుడి సోదరుడు సన్యాసిపాత్రుడి భార్య అనిత. ఆమె కూడా మున్సిపల్ చైర్పర్సన్ పదవికి పోటీ చేస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన రెండు వర్గాల మధ్య రాజకీయ పోటీ నెలకొనడంతో ఈ వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
టీడీపీ నుంచి వైసీపీలో చేరిన సన్యాసిపాత్రుడు(Chintakayala family)
వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అయ్యన్నపాత్రుడి సోదరుడు సన్యాసిపాత్రుడు జగన్ గూటికి చేరారు. ఇప్పుడు నర్సీపట్నంలో తోడికోడళ్లు రాజకీయ బరిలోకి దిగుతుండటంతో ఎన్నికల పోరు రసవత్తరంగా మారనుంది. ఒకవైపు కూటమి అభ్యర్థిగా పద్మావతి పోటీ చేస్తుండగా, మరోవైపు వైసీపీ తరఫున అనిత బరిలో నిలుస్తున్నారు. చింతకాయల కుటుంబానికి చెందిన ఈ ఇద్దరు మహిళలు వేర్వేరు రాజకీయ పార్టీల తరఫున పోటీకి సిద్ధమవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. సాధారణంగా ఎన్నికల సమయంలో ప్రధాన రాజకీయ పార్టీల మధ్య పోటీ కనిపిస్తుంటుంది. అయితే, ఇక్కడ ఒకే కుటుంబానికి చెందిన తోడికోడళ్లు ప్రత్యర్థులుగా నిలవడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. కుటుంబ సంబంధాలు ఒకవైపు, రాజకీయ సిద్ధాంతాలు మరోవైపు ఉండటంతో ఈ పోరు ఎలా సాగుతుందన్న ఆసక్తి స్థానికుల్లో నెలకొంది.
గతంలో కౌన్సిలర్‌గా పోటీ చేసిన పద్మావతి
వైసీపీ ప్రభుత్వ హయాంలో మున్సిపల్ కౌన్సిలర్‌గా పోటీ చేసిన పద్మావతి విజయం సాధించారు. టీడీపీ తరఫున తన గళాన్ని బలంగా వినిపించారు. రాజకీయంగా అయ్యన్నపాత్రుడికి ఆయన సతీమణి పద్మావతి మద్దతుగా నిలిచారు. ఇప్పుడు ఏకంగా మున్సిపల్ చైర్పర్సన్ పదవికి పోటీ చేస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. పైగా, తోడికోడలితో సమరానికి సై అంటున్నారు. ఈ పోటీలో వ్యక్తిగత పరిచయాలు, కుటుంబ అనుబంధాల కంటే రాజకీయ పార్టీల బలం, స్థానిక సమస్యలు, ప్రజల ఆదరణ కీలక పాత్ర పోషించనున్నాయి. నర్సీపట్నం ప్రజలు ఎవరికి మద్దతు ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది.


