బుల్లెట్లా తెరపైకొచ్చిన బాలయ్య కూతురు
Balakrishna’s Daughter Become Visakha Mayor: విశాఖ మేయర్ రేసులో బాలకృష్ణ కుమార్తె తేజస్విని పేరు ఒక్కసారిగా తెరపైకి వచ్చింది. ఆమె భర్త శ్రీభరత్ ప్రస్తుతం విశాఖ ఎంపీగా ఉన్నారు.

Balakrishna’s Daughter Become Visakha Mayor: విశాఖ మేయర్ పీఠం జనరల్ మహిళకు రిజర్వ్ కావటంతో సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. అధికార విపక్షాలనుంచి కీలకమైన పేర్లు బయటికొస్తున్నాయి. మరీ ముఖ్యంగా టీడీపీ నుంచి వినిపిస్తున్న పేరు సాగరనగరిలో అలలతోపాటు హోరెత్తిపోతోంది. తండ్రి ఎమ్మెల్యే, భర్త ఎంపీ. బావ మంత్రి. రాష్ట్రాధినేత తండ్రికి స్వయానా వియ్యంకుడు. ఇన్ని అర్హతలున్న తేజస్విని పేరు విశాఖ మేయర్ బరిలో అప్పుడే మార్మోగిపోతోంది.
నందమూరి తేజస్విని బాలయ్య చిన్నకూతురు. ఆమె భర్త భరత్ విశాఖపట్టణం ఎంపీగా ఉన్నారు. విశాఖ కోడలిగా తేజస్విని అందరికీ చిరపరిచితురాలు. పైగా విద్యావంతురాలు. ఈమధ్య యాడ్స్, డ్యాన్స్‌లతో కూడా సెలబ్రిటీలకు మించి పాపులారిటీ తెచ్చుకున్నారు. విశాఖ మేయర్ పీఠం జనరల్ మహిళకు రిజర్వ్ అయిందనే ప్రకటన రావడమే ఆలస్యం.. తేజస్విని పేరు ప్రచారంలోకి వచ్చింది. ఆమెతో పాటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ సతీమణి లావణ్య పేరు కూడా వినిపిస్తోంది. మాజీ కార్పొరేటర్ ముక్కా శ్రావణి, మరో ప్రముఖ వ్యాపారవేత్త కూతురి పేరు కూడా వినిపిస్తున్నా.. ప్రస్తుతం అందరి చర్చా తేజస్విని చుట్టే తిరుగుతోంది.
బాలయ్య కూతురే బరిలో ఉంటానంటే టీడీపీలో మరెవరూ పోటీకి రాకపోవచ్చు. కుటుంబ రాజకీయం వద్దనుకుంటే మాత్రం మరొకరు తెరపైకి రావచ్చు. తేజస్విని ఆసక్తితో ఉన్నారా లేదా అన్నది ఇంకా బయటపడలేదు. కానీ ప్రతిపాదనైతే తెరపైకొచ్చింది. టీడీపీ నుంచి నాలుగైదు పేర్లు ప్రచారంలో ఉంటే.. అటు వైసీపీ నుంచి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సతీమణి హిమగౌరి, పార్టీలో యాక్టివ్‌గా ఉన్న ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. అనకాపల్లి మాజీ ఎంపీ సత్యవతి, బొత్స సతీమణి ఝాన్సీ పేర్లు కూడా తెరపైకి రావటంతో వైసీపీ నుంచి కూడా బలమైన అభ్యర్థి బరిలో నిలవడం ఖాయమని తేలిపోయింది.



