పరివర్తన వచ్చిందేమో.. రాజనీతి ఎక్కడ?

పరివర్తన రాజనీతి పార్టీ. ఇలా చెబితే ఎవరికీ ఎక్కదేమోనని పీఆర్పీ అని షార్ట్ నేమ్. వినగానే ఒకప్పటి చిరంజీవి పెట్టి తర్వాత ఎత్తేసిన ప్రజారాజ్యం పార్టీ గుర్తుకొచ్చేలా. కాంగ్రెస్‌లో కలిసిపోయిన ఆ పార్టీ పేరు ఎందుకు పెట్టారంటే అది ప్రరాప మాది పరాపా అంటూ చిట్టాపద్దుల ఖాతాల్లో ఆరితేరిన విజయసాయిరెడ్డి చెబుతారు. పాపం ప్రారంభంలోనే పేరు మీదే ఇంత వివరణ ఇవ్వాల్సి వస్తే ఇక ఆయన పార్టీ సిద్దాంతాలు, విధి విధానాలు ఎలా ఉంటాయో, ఇంకెన్ని వివరణలు ఇవ్వాల్సి వస్తుందో? సవరణలు చేయాల్సి వస్తుందో?
కంపెనీల బ్యాలెన్స్ షీట్లు సరిచేసినంత సులువు కాదు రాజకీయం. ఇక ఓ పార్టీ పెట్టడం, ప్రజలను ఒప్పించడమంటే తలకిందులుగా తపస్సు చేసినంత కష్టం. పార్టీ ప్రకటనకు ముందే మూడు నాలుగు ప్రెస్‌మీట్లు పెట్టి కమింగ్ సూన్ అంటూ ఊరించారు. తీరా పార్టీ పేరు దగ్గరే విజయసాయిరెడ్డి తప్పటడుగు వేసినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే పార్టీ పేరులో తెలుగుదనం లేదు. పరివర్తన రాజనీతి అనే పార్టీ తమిళనాడు, పాండిచ్చేరిలో ఇదివరకు ఒక్కో సీటులో పోటీచేసింది. ఆ పేరుతో మూడేళ్లక్రితమే ముకేష్ అనే ఆయన ఢిల్లీలో పార్టీని కూడా రిజిస్టర్ చేశాడు. ఉత్తరాఖండ్‌లోకూడా అదే పేరుతో ఎలాంటి కార్యక్రమాలూ చేపట్టని పార్టీ ఉంది
కమ్మలు, క్రిస్టియన్ రెడ్లే అధికారం అనుభవించారని, వేరేవారికి అవకాశమే రాలేదని విజయసాయిరెడ్డి స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రులైన నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డిని ఆయన మరిచిపోయినట్లున్నారు. కొన్నిచోట్ల ముస్లింలకు టికెట్లు ఇస్తానని విచిత్రమైన ప్రకటన చేశారు. ఇప్పటిదాకా అన్ని పార్టీలు సామాజిక సమీకరణాల ఆధారంగా రాజకీయం చేస్తూ వచ్చాయి. విజయసాయిరెడ్డి తాను కూడా అదే దారిలో పోతానంటున్నారు.
వైసీపీ నుంచి ఎదురైన అవమానాలు ఏకరువుపెట్టారు. చెప్పుడు మాటలు విని జగన్ పక్కనపెడితే, మరో దారిలేక కొత్త జెండా పట్టుకున్నానని చెప్పుకొచ్చారు. కులమతాలు లేవని, యువతకు ప్రాధాన్యం ఇస్తామని ఏవేవో స్టేట్మెంట్లు ఇచ్చారు. కుటుంబపార్టీల గురించి మాట్లాడారు. కానీ ఆయన కుటుంబమంతా వేదికపై కనిపించడం మరో తప్పటడుగు. పార్టీ ప్రకటనకు ముందే ఎవరో ఓ రెడ్డిగారు మెడలోని వైసీపీ కండువాను పక్కన పెట్టేసి విజయసాయిరెడ్డి పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఆయన తప్పు ఇంకా పరివర్తన రాజనీతి పార్టీకి ఓపెనింగ్స్ ఇంకా మొదలుకాలేదు. ముక్కూ మొహం తెలిసిన ముఖ్య నేతలెవరయినా చేరతారనే నమ్మకం కూడా లేదు.



