తన కట్టూబొట్టులో ఉట్టిపడే భారతీయత!

తనది ఇటలీనే కావచ్చు. కానీ తను మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కోడలు. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ సతీమణి. ఎప్పుడైతే ఇందిరాగాంధీ ఇంట కోడలిగా అడుగుపెట్టిందో ఆరోజు నుంచే భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు, ఆహారపు అలవాట్లను అందిపుచ్చుకున్నారు కాంగ్రెస్‌పార్టీ అధినేత్రి సోనియాగాంధీ. తన జ్ఞాపకాలను దొంతరలను ఆత్మకథతో విప్పబోతున్నారు. నవంబరు10న విడుదల కానున్న సోనియాగాంధీ ఆత్మకథ ‘బిలాంగింగ్ ఎ జర్నీఆఫ్ లవ్’లో కొన్ని పేజీలను ప్రచురణ సంస్థ టీజర్లా విడుదలచేసింది.
రాజీవ్‌గాంధీతో వివాహబంధం తర్వాత భారతీయ సంప్రదాయాలు, ఆ కుటుంబ ఆహారపు అలవాట్లపై ఆసక్తికర విషయాలను తన ఆత్మకథలో సోనియాగాంధీ ఆవిష్కరించారు. భర్త రాజీవ్‌గాంధీతో కలిసి అత్తింట తొలిసారి తందూరీ చికెన్ రుచిచూశారు సోనియా. మొదట దాన్ని రుచిచూడగానే నోరంతా మంటగా అనిపించింది. కానీ ఆ తర్వాత మెల్లమెల్లగా అందరితో కలిసి ఆ భోజనాన్ని సోనియా ఆస్వాదించడం మొదలుపెట్టారు. అన్నంతో పాటు పుల్కాలు, ఒక కూర, మటన్, చేపలు లేదా చికెన్ రోజువారీ మెనూలో ఉండేవి. కందిపప్పు మాత్రం తప్పనిసరంటూ సోనియా తన జ్ఞాపకాలు నెమరేసుకున్నారు.
పెళ్లయ్యేదాకా సోనియాగాంధీది అధునాతన వస్త్రధారణే. కానీ రాజీవ్ సతీమణిగా అత్తింట అడుగుపెట్టాక ఆమె ఆహార్యం మారిపోయింది. చీర ప్రపంచంలోనే అత్యంత అందమైన వస్త్రాల్లో ఒకటిగా భావించారు. తానే స్వయంగా ధరించడం అలవాటు చేసుకున్నారు. వివాహానికి మాత్రం.. జవహర్లాల్ నెహ్రూ జైల్లో ఉన్న సమయంలో నూలుతో నేసిన చీరను ధరించానని సోనియా గుర్తుచేసుకున్నారు.



