What Happened to YSRCP in Pulivendula: పులివెందుల.. ఒకప్పుడు వైఎస్ఆర్ కుటుంబానికి కంచుకోట. 1978 నుంచి ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కుటుంబం తనదైన రాజకీయ ముద్ర వేసుకుంది. ఎన్టీఆర్ ప్రభంజనం కొనసాగిన రోజుల్లోనూ ఆ కుటుంబం తన రాజకీయ పట్టును నిలబెట్టుకుంది. ఎన్ని రాజకీయ ఒడిదొడుకులు ఎదురైనా పులివెందులలో మాత్రం వైఎస్ఆర్ కుటుంబానికి తిరుగులేకుండా పోయింది. అలాంటి నియోజకవర్గంలో ఇప్పుడు పరిస్థితులు ఒక్కసారిగా మారుతున్నాయి. జగన్ ముఖ్యమంత్రిగా ఓడిపోయిన తర్వాత వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కడప రాజకీయాల్లోనూ పార్టీకి గతంలో ఎన్నడూ ఎదురుకాని పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ టీడీపీ పైచేయి సాధించడంతో వైఎస్ఆర్ కుటుంబం రాజకీయ ప్రాబల్యంపై చర్చ మొదలైంది.

పులివెందులలో మారిన రాజకీయ సమీకరణాలు

గతంలో ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా పులివెందుల, కడప జిల్లాలో వైసీపీ కార్యకర్తలు పార్టీ కోసం గట్టిగా నిలబడేవారు. ఎన్నికలు ఏవైనా ప్రత్యర్థి పార్టీలకు గట్టి పోటీ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో వైసీపీ ఆశించిన స్థాయిలో పోరాటం చేయలేకపోయింది. మరోవైపు టీడీపీ తన బలాన్ని పెంచుకుంటూ ముందుకు సాగుతోంది. దీంతో దశాబ్దాలుగా వైఎస్ఆర్ కుటుంబానికి తిరుగులేని ప్రాంతంగా ఉన్న పులివెందులలో ఇంతటి మార్పు ఎందుకు వచ్చిందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో వైసీపీకి చెందిన కార్యకర్త ఊటుకూరు సుబ్బరామయ్య రాసిన లేఖ ఇప్పుడు కడప జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. పార్టీ ప్రస్తుత పరిస్థితికి కారణాలేమిటో వివరిస్తూ ఆయన రాసిన ఈ లేఖలో ముఖ్యంగా వైఎస్ అవినాష్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేశారు.

వైసీపీ కార్యకర్తల కష్టానికి గుర్తింపు లేదు: సుబ్బరామయ్య

వైఎస్ఆర్ కుటుంబంతో తమకు ఐదు దశాబ్దాల అనుబంధం ఉందని సుబ్బరామయ్య తన లేఖలో గుర్తుచేశారు. రాజారెడ్డి కాలం నుంచి పార్టీ కోసం తమ కుటుంబాలు రక్తాన్ని, చెమటను ధారపోశాయని పేర్కొన్నారు. వైఎస్ఆర్ అందించిన సంక్షేమం, ఆయన నాయకత్వంపై ఉన్న అభిమానంతో పార్టీ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పనిచేశామని వివరించారు. వైఎస్ఆర్ తనయుడిగా జగన్ తమను ముందుండి నడిపిస్తారని ఆశించామని, ఆయన నాయకత్వంపై నమ్మకంతో పార్టీ కోసం శ్రమించామని తెలిపారు. అయితే ప్రస్తుతం కడప జిల్లాలో వైసీపీ ఎదుర్కొంటున్న పరిస్థితులను చూస్తుంటే క్షేత్రస్థాయిలో పనిచేసిన కార్యకర్తలుగా తీవ్ర ఆవేదన కలుగుతోందని పేర్కొన్నారు. పార్టీ కోసం జీవితాలను అంకితం చేసిన తమలాంటి వారికి ఇప్పుడు తమ బాధను ఎవరితో చెప్పుకోవాలో కూడా తెలియని పరిస్థితి ఏర్పడిందని వాపోయారు.

అవినాష్ రెడ్డిపై సుబ్బరామయ్య తీవ్ర ఆరోపణలు

గతంలో కడప జిల్లా రాజకీయ వ్యవహారాల్లో వైఎస్ వివేకానందరెడ్డి, షర్మిల కీలకంగా వ్యవహరించేవారని సుబ్బరామయ్య గుర్తుచేశారు. వైఎస్ఆర్ బతికున్న సమయంలో కడప, పులివెందుల ప్రాంతాల్లో పార్టీ బాధ్యతలను వివేకానందరెడ్డి చూసుకునేవారని పేర్కొన్నారు. అయితే వివేకానందరెడ్డి మరణం, షర్మిల పార్టీకి దూరం కావడంతో కడప జిల్లాలో పార్టీ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితికి వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి వ్యవహారశైలే ప్రధాన కారణమని సుబ్బరామయ్య తన లేఖలో ఆరోపించారు. పార్టీని దశాబ్దాలుగా నమ్ముకుని పనిచేస్తున్న కార్యకర్తలను పక్కనపెట్టి, తమకు అనుకూలంగా ఉండేవారికే ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు. క్షేత్రస్థాయిలో పార్టీ కోసం కష్టపడిన వారి అభిప్రాయాలకు విలువ లేకుండా పోయిందని, పనులు, నిధుల కేటాయింపుల్లోనూ కొందరికే ప్రాధాన్యత లభిస్తోందని పేర్కొన్నారు. దీంతో నిజమైన వైఎస్ఆర్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

వైసీపీ ఓటమికి అవినాష్‌రెడ్డి కారణం: సుబ్బరామయ్య

ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కడప జిల్లాలో వైసీపీ ఎదుర్కొన్న పరాజయాలకు అవినాష్ రెడ్డి వ్యవహారశైలే కారణమని సుబ్బరామయ్య ఆరోపించారు. గతంలో వైసీపీకి భారీ మెజారిటీ వచ్చే అవకాశం ఉన్న ప్రాంతాల్లోనూ ఇప్పుడు ఓటు బ్యాంకు తగ్గిపోయిందని పేర్కొన్నారు. పులివెందుల నుంచి జమ్మలమడుగు, రైల్వేకోడూరు, ప్రొద్దుటూరు, బద్వేలు, కమలాపురం వరకు పార్టీ కోసం పనిచేసిన వైఎస్ఆర్ అభిమానులను, కార్యకర్తలను అవినాష్ రెడ్డి తన నిర్ణయాలతో దెబ్బతీశారని విమర్శించారు. తనకు అనుకూలంగా ఉండేవారికే ప్రాధాన్యత ఇవ్వడం వల్ల మిగిలిన నాయకులు, కార్యకర్తలు పార్టీకి దూరమయ్యే పరిస్థితి వచ్చిందని అభిప్రాయపడ్డారు. నియోజకవర్గాల్లో పార్టీ కోసం కష్టపడిన వారికి గౌరవం దక్కకపోవడం, వారి అభిప్రాయాలను పట్టించుకోకపోవడం వల్లే క్షేత్రస్థాయిలో వైసీపీ బలహీనపడిందని ఆయన లేఖలో పేర్కొన్నారు.

పులివెందులను జగన్ ఎందుకు పట్టించుకోవడం లేదు..?

సుబ్బరామయ్య రాసిన ఈ లేఖ ఇప్పుడు వైసీపీలో కొత్త చర్చకు తెరలేపింది. ముఖ్యంగా పార్టీ ఓటమికి ప్రత్యర్థుల వ్యూహాల కంటే సొంత పార్టీలోని నాయకుల వ్యవహారశైలే కారణమని ఒక కార్యకర్త బహిరంగంగా ఆరోపించడం ప్రాధాన్యత సంతరించుకుంది. వైఎస్ఆర్ కుటుంబానికి దశాబ్దాలుగా అండగా నిలిచిన కార్యకర్తలు ఇప్పుడు ఎందుకు దూరమవుతున్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికి ఎందుకు గుర్తింపు దక్కడం లేదు.. కడప జిల్లాలో పార్టీ పరిస్థితి దిగజారుతున్నా నాయకత్వం ఎందుకు దిద్దుబాటు చర్యలు తీసుకోలేకపోతోంది.. అన్న ప్రశ్నలు ఈ లేఖతో మరోసారి తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా జగన్ నాయకత్వంపై నమ్మకంతో పనిచేసిన కార్యకర్తలే ఇప్పుడు అసంతృప్తి వ్యక్తం చేస్తుండటం వైసీపీకి ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన పరిస్థితిని తీసుకొచ్చిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఒకప్పుడు వైఎస్ఆర్ కుటుంబానికి ఎదురులేని రాజకీయ అడ్డాగా ఉన్న పులివెందులలో ఇప్పుడు పార్టీ ఎదుర్కొంటున్న పరిస్థితి వెనుక అసలు కారణాలు ఏమిటన్నది రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.