ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో పాలు దొరకడం కష్టమేనా..?
Telangana Dairy Industry: తెలంగాణలో పాల దిగుబడి తగ్గిపోతుంది.పెరుగుతున్న పశుపోషణ ఖర్చులు.. ఆందోళనలో పాడి రైతులు. దీంతో హైదరాబాద్‌లో పాల సరఫరాలో అంతరాయం ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Telangana Dairy Industry: వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావం తెలంగాణ పాడి పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వర్షాభావ పరిస్థితులు, భూగర్భ జలాల తగ్గుదల, విపరీతమైన ఎండలతో పశువులకు నీరు, పశుగ్రాసం కొరత ఏర్పడుతోంది. ఫలితంగా పశువుల పాల దిగుబడి తగ్గుతుండగా, వాటి పోషణ ఖర్చులు మాత్రం రోజురోజుకూ పెరుగుతున్నాయి. దీంతో పాడి పరిశ్రమపై ఆధారపడిన రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మరింత తగ్గుతున్న పాల దిగుబడి.. పెరుగుతున్న ఖర్చులు..
ఒకప్పుడు రోజుకు 10 నుంచి 15 లీటర్ల పాలు ఇచ్చే పశువులు.. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో ఐదు నుంచి ఏడు లీటర్లకే పరిమితమవుతున్నాయని రైతులు చెబుతున్నారు. వర్షాలు తగ్గడంతో పచ్చిగడ్డి లభ్యత పడిపోయింది. పశువులకు సరైన పోషకాహారం అందక పాల ఉత్పత్తిపై ప్రభావం పడుతోంది. మరోవైపు ఎండుగడ్డి కట్ట ధర గతంలో రూ.50 ఉండగా.. ప్రస్తుతం రూ.150కు చేరిందని రైతులు చెబుతున్నారు. తవుడు, మొక్కజొన్న పొడి, పత్తిచెక్క వంటి దాణా ధరలు కూడా పెరిగాయి. పాల దిగుబడి తగ్గినా మేత, మందులు, వైద్యం, కూలీల ఖర్చులు తగ్గకపోవడంతో రైతులకు గిట్టుబాటు కావడం లేదు.
ఐదేళ్లలో పాల ఉత్పత్తి రికార్డులు ఇవే
తెలంగాణలో గత ఐదేళ్ల పాల ఉత్పత్తి గణాంకాలను పరిశీలిస్తే స్వల్ప హెచ్చుతగ్గులతో పెరుగుదల కనిపిస్తోంది. 2020-21లో 57.65 లక్షల టన్నుల పాల ఉత్పత్తి ఉండగా, 2021-22లో 58.08 లక్షల టన్నులు, 2022-23లో 58.55 లక్షల టన్నులకు చేరింది. 2023-24లో స్వల్పంగా తగ్గి 58.40 లక్షల టన్నులుగా నమోదైంది. 2024-25లో మళ్లీ పెరిగి 59.35 లక్షల టన్నులకు చేరింది. అయితే రాష్ట్ర స్థాయిలో ఉత్పత్తి పెరుగుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో రైతుల ఆదాయం పెరుగుతోందని చెప్పలేని పరిస్థితి నెలకొంది. పశువుల జనాభాలోనూ మార్పులు కనిపిస్తున్నాయి. 2012లో తెలంగాణలో ఆవులు, ఇతర కేటగిరీ పశువుల సంఖ్య 48.80 లక్షలుగా ఉండగా.. 2019 నాటికి 42.32 లక్షలకు తగ్గింది. ఇదే సమయంలో గేదెల సంఖ్య 41.60 లక్షల నుంచి 42.26 లక్షలకు పెరిగింది. పశువుల పెంపకంలో ఈ మార్పులు కూడా పాడి పరిశ్రమ పరిస్థితిని ప్రభావితం చేస్తున్నాయి. పశువులను అమ్ముకోలేక, పోషించలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
హైదరాబాద్‌లో పాల ధరలు పెరగడం ఖాయమా..?
ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గడం, ఉష్ణోగ్రతలు పెరగడం, నీటి కొరత ఏర్పడటం పశుపోషణకు మరిన్ని సవాళ్లను తీసుకొస్తున్నాయి. పశుగ్రాసం సాగు తగ్గితే పశువుల పోషణ మరింత భారమవుతుంది. ఇదే పరిస్థితి కొనసాగితే పాల దిగుబడిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. తెలంగాణ స్థాయిలో ప్రస్తుతం పాల ఉత్పత్తి పెరుగుతున్నప్పటికీ, రైతులకు గిట్టుబాటు లేకపోవడం పాడి పరిశ్రమ భవిష్యత్తుపై ఆందోళన కలిగిస్తోంది. ఫలితంగా తెలంగాణకు ఆయువు పట్టుగా ఉన్న హైదరాబాద్‌కు నిత్యం లక్షలాది లీటర్లు అవసరం ఉంది. డిమాండ్‌కు తగ్గట్లు పాల దిగుబడి లేకపోతే పరిస్థితి ఏంటని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా పాలు ధరలు పెరిగి.. ప్రజలకు భారంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కల్తీ పాల తయారీ కేంద్రాలు మరిన్ని పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అయితే హైదరాబాద్ డిమాండ్‌కు తగినట్లు పాల సరఫరా చేయాలని ప్రజలు కోరుతున్నారు.



