Rahul Gandhi: పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్
Rahul Gandhi Defamation Case: పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి భారీ ఊరట లభించింది. సుల్తాన్‌పూర్‌లో నమోదైన కేసును న్యాయాధికారి కొట్టివేశారు. రాహుల్ గాంధీని నిర్దోషిగా ప్రకటించారు.

Rahul Gandhi Defamation Case: యూపీలోని సుల్తాన్పూర్ కోర్టులో నమోదైన పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి (Rahul Gandhi) భారీ ఊరట లభించింది. ఈ కేసులో రాహుల్ గాంధీని నిర్దోషిగా ప్రకటిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. 2018లో కర్ణాటక ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలపై ఏడేళ్ల తర్వాత సుల్తాన్పూర్ కోర్టు తుది తీర్పు వెలువరించింది. తీర్పు వెలువడే సమయంలో రాహుల్ గాంధీ (Rahul Gandhi) స్వయంగా కోర్టుకు హాజరయ్యారు. రాహుల్ వ్యాఖ్యలు పరువు నష్టం పరిధిలోకి రావని సుల్తాన్పూర్ కోర్టు అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ శుభమ్ వర్మ తెలిపారు. కోర్టు తీర్పుతో కాంగ్రెస్ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ఈ వ్యవహారం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
రాహుల్‌పై ఎప్పుడు కేసు నమోదు చేశారంటే..
2018 మేలో కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా బెంగళూరులో రాహుల్ గాంధీ భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై (Amit sha) రాహుల్ తీవ్ర విమర్శలు చేశారు. దీంతో రాహుల్ వ్యాఖ్యలపై ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ (BJP) నేత విజయ్ మిశ్రా సుల్తాన్పూర్ కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టు ఈ కేసుపై విచారణ చేపట్టింది. ఈ కేసులో రాహుల్ గాంధీ 2024 ఫిబ్రవరిలో బెయిల్ పొందారు. అయితే, సుదీర్ఘంగా సాగిన వాదనలు ముగియడంతో న్యాయమూర్తి నేడు తుది తీర్పు వెలువరించారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు పరువు నష్టం పరిధిలోకి రావని సుల్తాన్పూర్ కోర్టు తేల్చి చెప్పింది. దీంతో ఈ వ్యవహారం దేశ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.
రాహుల్ కాన్వాయ్‌కు ప్రమాదం..
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి తృటిలో ప్రమాదం తప్పింది. లక్నో విమానాశ్రయం నుంచి సుల్తాన్‌పూర్‌కు కారులో బయలుదేరారు. పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై వెళ్తున్న సమయంలో కాన్వాయ్‌లోని ఓ కారు డ్రైవర్ ఒక్కసారిగా బ్రేకులు వేయడంతో ఐదు వాహనాలు, ఓ అంబులెన్స్ పరస్పరం ఢీకొన్నాయి. అయితే, కాన్వాయ్‌లో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలకు స్వల్ప గాయాలయ్యాయని, రాహుల్ గాంధీకి (Rahul Gandhi) ఎలాంటి ప్రమాదం జరగలేదని కాంగ్రెస్ (Congress) నేతలు తెలిపారు. మరోవైపు, రాహుల్ గాంధీ కాన్వాయ్ ప్రమాదంపై కాంగ్రెస్ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సుల్తాన్పూర్ కోర్టులో తుది తీర్పు వెలువడిన నేపథ్యంలో ఈ ఘటన వెనుక ఏదైనా కుట్ర కోణం ఉందా అనే అంశంపై విచారణ జరపాలని కోరుతున్నారు.
కోర్టు తీర్పుపై కాంగ్రెస్ నేతల్లో ఆనందం
అమిత్ షాపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో రాహుల్ గాంధీని పలుమార్లు అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారని కాంగ్రెస్ నేతలు (Congress) గతంలో ఆరోపించారు. అంతేకాకుండా, ఆయన ఎంపీ పదవికి అనర్హుడిగా ప్రకటించే ప్రయత్నాలు జరిగాయని కూడా వారు పేర్కొన్నారు. సుల్తాన్పూర్ కోర్టు తీర్పుతో రాహుల్ గాంధీ (Rahul Gandhi) నిర్దోషిగా బయటపడ్డారని కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు ఎన్ని కుట్రలు చేసినా వాటిని రాహుల్ గాంధీ సమర్థవంతంగా తిప్పికొడతారని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు. సుల్తాన్పూర్ కోర్టు తీర్పు బీజేపీ నేతలకు చెంపపెట్టు అని అన్నారు. ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలను కోర్టు వరకు తీసుకెళ్లడం సరైన పద్ధతి కాదని అభిప్రాయపడ్డారు. మొత్తానికి, ఏడేళ్ల తర్వాత రాహుల్ గాంధీకి ఈ కేసులో ఊరట లభించడంతో ఢిల్లీతో పాటు ఉత్తరప్రదేశ్‌లోని కాంగ్రెస్ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
వచ్చే ఏడాది యూపీ అసెంబ్లీ ఎన్నికలు
వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఇండియా కూటమిలో భాగంగా ఉన్న సమాజ్‌వాదీ పార్టీతో కలిసి కాంగ్రెస్ పార్టీ (Congress) పొత్తు పెట్టుకుంటుందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేయడం వల్లే బీజేపీ గెలిచిందని కాంగ్రెస్ నేతలు చర్చించుకుంటున్నారు. మరోసారి అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా ఉండేందుకు ఉత్తరప్రదేశ్‌లో పొత్తు ఖాయమని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.



