Jio: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మెగా ఐపీవో జియో ప్లాట్‌ఫామ్స్‌ మార్కెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించింది. పబ్లిక్‌ ఇష్యూకి ఏకంగా కోటి అప్లికేషన్లు అందుకుంది. ప్రపంచంలోనే ఈ స్థాయిలో అప్లికేషన్లు అందుకున్న తొలి కార్పొరేట్‌ కంపెనీగా జియో ప్లాట్‌ఫామ్స్‌ కొత్త రికార్డు సృష్టించింది. వారీ ఎనర్జీస్‌ పేరిట ఉన్న 97లక్షల అప్లికేషన్ల రికార్డే ఇప్పటిదాకా కొనసాగింది. ఇప్పుడు జియో ప్లాట్‌ఫామ్స్‌ ఆ రికార్డును బీట్‌చేసింది.

గతంలో బజాజ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, భారత్‌ కోకింగ్‌ కోల్‌ ఐపీవోలు సుమారు 90లక్షల అప్లికేషన్ల మార్క్‌ను అందుకున్నాయి. జియో ప్లాట్‌ఫామ్స్‌ పబ్లిక్‌ ఇష్యూలో 19.75 కోట్ల బిడ్లు విక్రయానికి ఉంచితే.. అక్టోబరు 23 మధ్యాహ్నానికే సుమారు 136 కోట్ల షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ బయ్యర్స్‌కోటాలో 4.90 కోట్ల షేర్లకు సుమారు 15రెట్లు ఎక్కువగా దగ్గరదగ్గర 71 కోట్ల షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. నాన్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్ల కోటాకు తొమ్మిదిన్నర రెట్ల స్పందన ఉంటే.. రిటైల్‌ కోటాలో 17.19 కోట్ల షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి.

అక్టోబరు 23 రాత్రి 7గంటల వరకు బిడ్డింగ్‌కు అవకాశం ఉండటంతో జియో ప్లాట్‌ఫామ్స్‌కి మరింత స్పందన ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అక్టోబరు 26న మదుపురులకు షేర్ల కేటాయింపు జరగనుంది. స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో అక్టోబరు 28న జియో ప్లాట్‌ఫామ్స్‌ షేర్లు నమోదవుతాయి. మొత్తం రూ.30,123 కోట్ల ఐపీవోలో భాగంగా యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి జియో ఇప్పటికే రూ.8,110 కోట్లు సమీకరించింది.