జిల్లా పరిషత్ చైర్మన్ పదవి రేస్ లో చింతమనేని నవ్యశ్రీ
దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కుమార్తె చింతమనేని నవ్యశ్రీ జిల్లా పరిషత్ చైర్మన్ పదవి కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తన తండ్రి మాస్ లీడర్‌గా ఉండటంతో తనకే అవకాశం దక్కుతుందనే ధీమాతో ఆమె ఉన్నట్లు తెలుస్తోంది.

Chintamaneni Navya Sri: ఏలూరు జిల్లా పరిషత్ చైర్మన్ పదవి కోసం కూటమి నేతల మధ్య పోటీ నెలకొంది. ఈ పదవిని దక్కించుకునేందుకు పలువురు ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీతో పాటు అధిష్టానం పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. మరోవైపు, ఐవీఆర్‌ఎస్ కాల్స్ ద్వారా తమకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతూ ప్రజలను అభ్యర్థిస్తున్నారు. దీంతో ఏలూరు జిల్లా పరిషత్ పీఠం ఎవరికి దక్కుతుందనే అంశం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
రేసులో ఎమ్మెల్యే చింతమనేని కుమార్తె..!
దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కుమార్తె చింతమనేని నవ్యశ్రీ జిల్లా పరిషత్ చైర్మన్ పదవి కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తన తండ్రి మాస్ లీడర్‌గా ఉండటంతో తనకే అవకాశం దక్కుతుందనే ధీమాతో ఆమె ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దెందులూరు నియోజకవర్గంలో తన తండ్రి చింతమనేని ప్రభాకర్ మొదటి ఎమ్మెల్యే అయితే, సెకండ్ ఎమ్మెల్యే అంటూ నవ్యశ్రీ ప్రచారం జరుగుతోంది. తండ్రి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేని సమయంలోనూ టీడీపీ సమావేశాలు, పలు పార్టీ కార్యక్రమాలకు ఆమె హాజరవుతున్నారు. ఈ క్రమంలో తనకు జిల్లా పరిషత్ చైర్మన్‌గా అవకాశం కల్పించాలని కోరుతూ ఏలూరు జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా, అధిష్టానం నిర్వహించే ఐవీఆర్‌ఎస్ కాల్స్‌లో తన పేరు వచ్చినప్పుడు తనకు మద్దతుగా బటన్ నొక్కాలని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. తండ్రి చింతమనేని ప్రభాకర్ ఆశీస్సులతో జడ్పీ పీఠం తనకే దక్కుతుందనే ధీమాతో ఆమె ముందుకు సాగుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
సై అంటున్న మాజీ ఎంపీ మాగంటి బాబు!
మాజీ ఎంపీ, మాజీ మంత్రి మాగంటి బాబు సైతం జిల్లా పరిషత్ చైర్మన్ పదవి రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. నామినేషన్ల గడువు దగ్గరపడుతుండటంతో ఆయన కూడా తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. 2014లో ఏలూరు టీడీపీ (TDP) ఎంపీగా పనిచేసిన మాగంటి బాబు, 2019 ఎన్నికల్లో ఏలూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2024 ఎన్నికల్లో ఏలూరు పార్లమెంట్ స్థానాన్ని మాగంటి బాబుకు కాకుండా, కడప జిల్లాకు చెందిన పుట్టా మహేష్‌కుమార్ యాదవ్‌కు టీడీపీ అధిష్టానం కేటాయించింది. ఆ ఎన్నికల్లో పుట్టా మహేష్‌కుమార్ యాదవ్ విజయం సాధించడంతో మాగంటి బాబు యాక్టివ్ పాలిటిక్స్‌కు కొంతకాలంగా దూరంగా ఉన్నారు. అయితే, ఇప్పటివరకు అధిష్టానం నుంచి ఎలాంటి కీలక పదవి దక్కకపోవడంతో కనీసం జిల్లా పరిషత్ చైర్మన్‌గా అయినా అవకాశం కల్పించాలని ఆయన కోరుతున్నట్లు సమాచారం. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలతో సమావేశమైన ఆయన, అధిష్టానం వద్ద తనకు అనుకూలంగా లాబీయింగ్ చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. జడ్పీ చైర్మన్ పదవి తనకు కేటాయిస్తే గౌరవప్రదంగా ఉంటుందని ఆయన తన వాదనను వినిపిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
మాకు అవకాశం ఇస్తే బాగుంటుంది: బీజేపీ
కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న బీజేపీ (BJP) నేతలు సైతం ఏలూరు జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని తమకు కేటాయించాలని కోరుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఏలూరు మేయర్ పదవిని జనసేనకు కేటాయించిన నేపథ్యంలో, జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని తమకు ఇస్తే కూటమిలోని అన్ని పార్టీలకు సముచిత ప్రాధాన్యత ఇచ్చినట్లవుతుందని బీజేపీ నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో టీడీపీలో ఇద్దరు, ముగ్గురు నేతలు జడ్పీ పీఠం కోసం ప్రయత్నాలు చేస్తుండగా, తాజాగా బీజేపీ కూడా తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలతో ఏలూరు జిల్లా పరిషత్ చైర్మన్ పదవి కేటాయింపు కూటమిలో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. మరోవైపు, ఏలూరు జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని ఎవరికి కేటాయించాలనే అంశంపై సీఎం చంద్రబాబు (Chandrababu) సర్వేలతో పాటు ఐవీఆర్‌ఎస్ సర్వేలను కూడా నిర్వహిస్తున్నట్లు సమాచారం. నామినేషన్ల ప్రక్రియ ముగిసే సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో, అధిష్టానం ఎవరికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందనే ఉత్కంఠ నెలకొంది. చివరకు జడ్పీ పీఠం ఎవరిని వరిస్తుంది? టీడీపీ నేతల్లో ఒకరికి అవకాశం దక్కుతుందా? లేక కూటమి సమీకరణాల్లో భాగంగా బీజేపీకి కేటాయిస్తారా? అన్నది వేచి చూడాల్సిందే.


