సారీ చెబితే.. సల్మాన్‌ని బతకనిస్తారా!?

ఎంత చెడ్డా కండలవీరుడు కదా. ముచ్చటపడ్డాడు. తుపాకీ తీసుకుని వేటకు బయలుదేరాడు. కానీ తను ఎంచుకున్న ప్రాంతం రాంగ్. తను గురిపెట్టిన వన్యప్రాణి అంతకుమించిన రాంగ్. ఆ సరదా వేట ఏళ్లుగడిచినా అతన్ని నీడలా వెంటాడుతోంది. అతనిపై గ్యాంగ్‌స్టర్లు గురిపెట్టేలా చేసింది. సల్మాన్‌కే పరిమితం కాలేదు ఈ బెదిరింపు. అతనితో సన్నిహితంగా ఉన్నవారు కూడా టార్గెట్ అవుతున్నారు. కృష్ణజింకను వేటాడటం ఇంతదూరం తెస్తుందని బహుశా అప్పట్లో సల్మాన్‌ఖాన్ ఊహించి ఉండడు.
మాజీ మంత్రి, సల్మాన్ సన్నిహితుడు సిద్దిఖీని ముంబై నడిబొడ్డున కాల్చిచంపారు. అంతకుముందు సిద్దూ మూసేవాలా మర్డర్ జరిగింది. తాజాగా బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ తృటిలో తూటాల నుంచి తప్పించుకున్నాడు. ఈ సంఘటనలు అన్నింటికీ కారణం సల్మాన్‌ఖానే. సల్మాన్ ఇంటిమీదే తూటాలు పేలాయి. రాజస్థాన్‌లో ఎప్పుడో 28 ఏళ్లక్రితం కృష్ణజింకలను వేటాడటం సల్మాన్‌ఖాన్‌ని శాపంలా వెంటాడుతోంది. టైగర్‌ష్రాఫ్ మీద కాల్పులు జరిగాక సల్మాన్ సన్నిహితులు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతుకుతున్నారు.
బిష్ణోయ్ తెగకు ప్రకృతంటే ప్రాణం. కృష్ణజింకలంటే చెప్పలేనంత మమకారం. చెట్లను నరికేసినా తమను రంపంతో కోస్తున్నట్లు విలవిల్లాడిపోతారు. అలాంటిది కృష్ణజింకల వేటను తమ విశ్వాసాలపై జరిగిన దాడిగా ఆ తెగ భావించింది. ఆ తెగకు చెందిన లారెన్స్ బిష్ణోయ్ పాపులార్ గ్యాంగ్‌స్టర్. కృష్ణజింకలను వేటాడినందుకు సల్మాన్‌ఖాన్‌కి డెత్‌వారంట్ జారీ చేసింది బిష్ణోయ్ గ్యాంగ్. టైగర్ ష్రాప్‌పై దాడి తర్వాత బిష్ణోయ్ తెగకు సల్మాన్ క్షమాపణ చెప్పాలని కొందరు బాలీవుడ్ ప్రముఖులు సూచనలు చేసేదాకా వచ్చింది.
సారీ చెబితే సల్మాన్‌కి ప్రాణగండం తప్పుతుందా అంటే బిష్ణోయ్ సమాజం నుంచి ఆ భరోసా వస్తోంది. సల్మాన్ బిష్ణోయ్ సమాజానికి క్షమాపణ చెప్పాలని లారెన్స్ బిష్ణోయ్ చిన్నాన్న రమేష్ బిష్ణోయ్ కోరుతున్నాడు. ముంబైలో తన బంగ్లానుంచి సారీ అంటే సరిపోదు. రాజస్థాన్‌లోని బికనీర్ జిల్లాలో ఉన్న ముక్తిధామ్ ఆలయానికి వచ్చి క్షమాపణ చెబితే.. సల్మాన్ భద్రతకు తాము పూచీ తీసుకుంటామని గ్యాంగ్‌స్టర్ చిన్నాన్న మాటిస్తున్నాడు. నవంబరు 2న బిష్ణోయ్ సమాజ్ 542వ వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు.
1998లో హమ్ సాథ్ సాథ్ హై సినిమాషూటింగ్ సందర్భంగా రెండు కృష్ణ జింకలను వేటాడినట్లు సల్మాన్‌ఖాన్ అభియోగాలు ఎదుర్కున్నాడు. 2018లో జోధ్‌పూర్ ట్రయల్ కోర్టు సల్మాన్‌ఖాన్‌ని దోషిగా నిర్ధారించి ఐదేళ్ల జైలుశిక్షకూడా వేసింది. అయితే ఆ కేసులో సల్మాన్‌ఖాన్‌కి బెయిల్ లభించింది. సహనిందితులుగా ఉన్న సైఫ్‌అలీఖాన్, సోనాలిబింద్రే, నీలమ్‌ను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. కృష్ణజింకల వేట బిష్ణోయ్ తెగను తీవ్రంగా కలిచివేసింది. ఆ తెగకు చెందిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ అప్పటినుంచీ సల్మాన్‌ని టార్గెట్ చేసుకున్నాడు.
సారీ చెప్పమని బాలీవుడ్ ప్రముఖులు సూచిస్తున్నారు. క్షమాపణ చెబితే వదిలేస్తామని గ్యాంగ్‌స్టర్ చిన్నాన్న చెబుతున్నాడు. మరి కండలవీరుడు ఓ మెట్టుదిగి కృష్ణజింకల వేటపై పశ్చాత్తాపం ప్రకటిస్తాడా? బిష్ణోయ్ సమాజాన్ని క్షమాపణ కోరతాడా? అన్నదే ప్రశ్న. అయితే సల్మాన్ సారీ చెబితే నేరాన్ని అంగీకరించినట్లు అవుతుందని.. అది న్యాయపరమైన చిక్కులకు దారితీస్తుందనే వాదన కూడా ఉంది. దీంతో ఈ వివాదానికి బాలీవుడ్ హీరో ఎలాంటి క్లైమాక్స్ ఇస్తాడనే విషయం అందరికీ ఆసక్తిగానే ఉంది.



