Tiger Shroff : దావూద్‌ ఇబ్రహీం లేడు. ఛోటారాజన్‌లాంటి గ్యాంగ్‌స్టర్లు చరిత్రపుటల్లో కలిసిపోయారు. కానీ ముంబై ఇప్పటికీ వణుకుతూనే ఉంది. నయా గ్యాంగ్‌స్టర్ల తూటాలు ఎవరి ఒంట్లో దిగుతాయో తెలీదు. ఎవరిని ఎందుకు టార్గెట్‌ చేస్తారో తెలీదు. తమ టార్గెట్‌తో ఫ్రెండ్‌ షిప్‌ ఉన్నా సరే.. గ్యాంగ్‌స్టర్లు గన్ను గురిపెడుతున్నారు. బాలీవుడ్‌ నటుడు టైగర్‌ ష్రాఫ్‌ కారుపై కాల్పులతో ముంబై సెలబ్రిటీలంతా ప్రాణభయంతో వణికిపోతున్నారు.

టైగర్‌ ష్రాప్‌పై కాల్పుల ఘటనతో బాలీవుడ్‌లో సెలబ్రిటీలు రక్షణ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎప్పట్నించో బిష్ణోయ్‌ గ్యాంగ్‌కి టార్గెట్‌గా ఉన్న కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌ ప్రస్తుతం వై ప్లస్‌ కేటగిరీ సెక్యూరిటీలో ఉన్నారు. ఆయన ఇంటిపై గ్యాంగ్‌స్టర్లు కాల్పులకు తెగబడ్డారు. ఆయనకు సన్నిహితుడైన సిద్దిఖీని కాల్చిచంపారు. తాజాగా సల్మాన్‌కి సన్నిహితుడనే కారణంతో టైగర్‌ ష్రాఫ్‌ కూడా మాఫియా గ్యాంగ్‌కి టార్గెటయ్యాడు. దీంతో బాలీవుడ్‌ హీరోలు మరింత జాగ్రత్తపడుతున్నారు.

అక్షయకుమార్‌ ఇంటి కిటికీలు, తలుపులకు బుల్లెట్‌ప్రూఫ్‌ గ్లాస్‌లు ఏర్పాటుచేసుకుంటున్నాడు. తన ఇంటిదగ్గర కూడా రెక్కీ నిర్వహించారనే సమాచారంతో రణ్‌బీర్‌కపూర్‌ జాగ్రత్తపడుతున్నాడు. ముంబైలో మళ్లీ గ్యాంగ్‌స్టర్ల కార్యకలాపాలు పెరగటంతో సెలబ్రిటీలకు పోలీసులు భద్రత పెంచుతున్నారు. షారూక్‌ఖాన్‌, అమితాబచ్చన్‌, కంగనారనౌత్‌, అనుపమ్‌ఖేర్‌లాంటి సినీ ప్రముఖులకు ఇప్పటికే ప్రత్యేక భద్రత కల్పిస్తున్నారు.

1990లనాటి అండర్‌వరల్డ్‌ సంస్కృతిని సహించేదిలేదని పోలీసులు చెబుతున్నా కొత్తగా జెన్‌జీ గ్యాంగ్‌స్టర్లు పుట్టుకొస్తున్నారు. పట్టుమని పాతికేళ్లు కూడా లేని కుర్రోళ్లు క్రిమినల్స్‌ అవతారమెత్తుతున్నారు. టైగర్‌ష్రాప్‌పై కాల్పుల ఘటనలో పోలీసులకు దొరికిన నిందితుల్లో ఒకడి వయసు కేవలం 19 ఏళ్లు. మిగతావాళ్లంతా 23 ఏళ్లలోపువారే. పిచ్చోడి చేతికి రాయిలా.. పనీపాటా లేని బ్యాచ్‌చేతికి గన్నులు అందుతున్నాయి. ముంబైలో ఇదో కొత్త మాఫియా.