వెంకీకి మళ్లీ అనిల్ రావిపూడి మ్యాజిక్ అవసరమా..?
Venkatesh Anil Ravipudi Movie: ఫ్యామిలీ హీరో వెంకటేశ్, దర్శకుడు అనిల్ రావిపూడి సినిమాపై ఇప్పుడు అందరి దృష్టి మళ్లింది. ఆదర్శకుటుంబం ఏకే-47 సినిమా థియేటర్లలో బోల్తా కొట్టడంతో అనిల్ సినిమాపై ఆశలు రోజురోజుకు పెరుగుతున్నాయి.

Venkatesh Anil Ravipudi Movie: కొన్ని కాంబినేషన్లు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. వరుస విజయాలతో బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుంటాయి. అలాంటి క్రేజీ కాంబినేషన్లలో విక్టరీ వెంకటేశ్ – హిట్ మిషన్ అనిల్ రావిపూడి జోడీ ఒకటి. ఈ ఇద్దరి కలయికలో వచ్చిన సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు మంచి విజయాలను కూడా అందుకున్నాయి. అందుకే ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న జనవరి 12 విడుదల సినిమాపై వెంకీ అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు.
అనిల్ హిట్లే వెంకటేశ్‌కు ఫేమ్
గత పుష్కరకాలంలో వెంకటేశ్ నటించిన సినిమాలను పరిశీలిస్తే, ఆయనకు ఆశించిన స్థాయిలో విజయాలను అందించిన చిత్రాల్లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన సినిమాలే ప్రత్యేకంగా కనిపిస్తాయి. అనిల్ దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా నటించిన ఎఫ్-2, ఎఫ్-3, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు ఘన విజయాలను సొంతం చేసుకున్నాయి. అలాగే వెంకీ అతిథి పాత్రలో కనిపించిన చిరంజీవి సినిమా మన శంకరవరప్రసాద్ గారు కూడా గ్రాండ్ సక్సెస్ సాధించింది. మిగిలిన చిత్రాల్లో చాలా వరకు ఈ స్థాయి విజయాన్ని అందుకోలేకపోయాయి. కొన్ని సినిమాలు పరాజయాలను కూడా చవిచూశాయి. దీంతో గత పన్నెండేళ్లలో వెంకటేశ్‌కు భారీ విజయాలను అందించిన దర్శకుడిగా అనిల్ రావిపూడి పేరు ప్రత్యేకంగా వినిపిస్తోంది.
ఆదర్శ కుటుంబం ఫలితంతో పెరిగిన ఆసక్తి..?
వెంకటేశ్ తాజా చిత్రం ఆదర్శకుటుంబం -హౌస్ నంబర్ 47 ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో ఆయన అభిమానులు తదుపరి సినిమాపై మరిన్ని ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా అనిల్ రావిపూడితో రూపొందుతున్న జనవరి 12 విడుదల చిత్రంపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. వెంకటేశ్‌కు రచయితగా త్రివిక్రమ్ నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి వంటి విజయవంతమైన చిత్రాలను అందించారు. దీంతో త్రివిక్రమ్ దర్శకత్వంలోనూ వెంకీకి అలాంటి మ్యాజిక్ రిపీట్ అవుతుందని అభిమానులు ఆశించారు. అయితే ఆదర్శ కుటుంబం ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఇప్పుడు వెంకటేశ్‌కు అనిల్ రావిపూడి సినిమాలే కలిసివస్తున్నాయా.. అనే చర్చ మొదలైంది.
THE ACTION IS GETTING BIGGER IN KAZAKHSTAN 🔥
The shoot of #January12Vidudala is in full swing, with Victory @VenkyMama & @NANDAMURIKALYAN shooting a power-packed action sequence and a spectacular song 💥
Just wait for a FULL-ON ENTERTAINMENT FEAST this Sankranthi, arriving in theatres on JANUARY 12, 2027 ❤️🔥
@AnilRavipudi @KeerthyOfficial @IamKrithiShetty @gvprakash @sahugarapati7 @YoursSKrishna @Shine_Screens @ZeeStudios_ @SureshProdns @zeestudiossouth @zeemusicsouth #NileshDeorah @girishjohar #AmeetBhuvan @IamDivyaVijay @HaashtagMedia @UrsVamsiShekar
— Shine Screens (@Shine_Screens) November 5, 2026
అనిల్‌కు వెంకీ.. వెంకీకి అనిల్..
అనిల్ రావిపూడి ఇప్పటివరకు తెరకెక్కించిన తొమ్మిది సినిమాల్లో వెంకటేశ్ మూడు చిత్రాల్లో హీరోగా, మరో చిత్రంలో అతిథి పాత్రలో నటించారు. ఈ కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు విజయవంతం కావడంతో ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. వెంకటేశ్‌కు అనిల్ కలిసివచ్చారని, అనిల్‌కు వెంకీ సెంటిమెంట్‌గా మారారని అభిమానులు భావిస్తున్నారు. ఇతర స్టార్ హీరోలతోనూ ఆయన భారీ విజయాలను అందుకున్నారు. తనదైన వినోదాత్మక కథలు, ప్రేక్షకులను ఆకట్టుకునే కథనంతో హిట్ మిషన్‌గా పేరు తెచ్చుకున్నారు. అయినప్పటికీ వెంకటేశ్‌తో అనిల్ కాంబినేషన్‌కు ఉన్న ప్రత్యేకత మాత్రం వేరే. ప్రస్తుతం వెంకటేశ్- అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న జనవరి 12 విడుదల చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో అనిల్ రావిపూడిని దర్శకుడిగా పరిచయం చేసిన నటుడు, నిర్మాత కళ్యాణ్ రామ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. దీంతో సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంలో వెంకటేశ్ సరసన కీర్తి సురేశ్ నటిస్తుండగా, కళ్యాణ్ రామ్ జోడీగా కృతి శెట్టి కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కజకిస్థాన్‌లో జరుగుతోంది.
సంక్రాంతికి హిట్ ఖాయమా..?
అనిల్ రావిపూడి సినిమాలకు సంక్రాంతి సీజన్ ప్రత్యేకంగా కలిసొచ్చింది. గతంలో ఆయన తెరకెక్కించిన చిత్రాలు పొంగల్ బరిలో మంచి సందడి చేశాయి. ఇప్పుడు మరోసారి సంక్రాంతి నేపథ్యంలో జనవరి 12 విడుదలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే వెంకటేశ్ అభిమానుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గత విజయాల సెంటిమెంట్‌ను అనిల్ మరోసారి కొనసాగిస్తారా..? వెంకటేశ్‌కు మరో బ్లాక్‌బస్టర్ అందిస్తారా..? అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి వెంకీ అభిమానుల ఆశలన్నీ ఇప్పుడు జనవరి 12 విడుదలపైనే ఉన్నాయి. ఈ క్రేజీ కాంబో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి..



