తెలంగాణలో వ్యూహాలకు పదును పెడుతున్న బీఆర్ఎస్, బీజేపీ
Telangana Politics: తెలంగాణలో రాజకీయాలు రోజురోజుకీ వేడి పుట్టిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ, బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలో మరింత ఉధృతంగా ప్రజల్లోకి వెళ్లాలని బీఆర్ఎస్ భావిస్తోంది. అందులో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బస్సు యాత్ర చేపట్టాలని నిర్ణయించారు.

Telangana Politics: తెలంగాణ రాజకీయాలు ఇప్పటి నుంచే ఎన్నికల వేడిని సంతరించుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అధికార కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని బీజేపీ, బీఆర్ఎస్ విమర్శల దాడి పెంచుతున్నాయి. అయితే ఈ రాజకీయ పోరులో బీఆర్ఎస్కు మరో కొత్త ఆందోళన మొదలైనట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలో బీజేపీ బలపడితే తమ రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బందులు తప్పవన్న భయం గులాబీ శ్రేణుల్లో వ్యక్తమవుతోన్నట్లు సమాచారం. తెలంగాణపై కేంద్ర బీజేపీ నాయకత్వం ప్రత్యేకంగా దృష్టి సారించడం, వరుస పర్యటనలు, రాజకీయ కార్యక్రమాలతో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నించడం గులాబీ పార్టీని ఆలోచనలో పడేస్తోంది. ముఖ్యంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా భాగ్యనగరంలో నిర్వహించిన పాదయాత్ర, ఆయన ప్రసంగం బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఈ పర్యటనలో అమిత్ షా ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారు తప్పా.. బీఆర్ఎస్ ప్రస్తావన మాత్రం తీసుకురాలేదు. కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదిగితే, ఆ ప్రభావం నేరుగా బీఆర్ఎస్పై పడే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రజా సమస్యలే అస్త్రంగా బీఆర్ఎస్ పోరాటం
బీజేపీ రాజకీయంగా బలపడకుండా చూడటంతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని తమకు అనుకూలంగా మలుచుకోవాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఇందుకోసం ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు చేయాలని నిర్ణయించింది. రైతులు, విద్యార్థులు, సాగునీరు, తాగునీరు వంటి అంశాలను ప్రధానంగా తీసుకుని క్షేత్రస్థాయిలో ఉద్యమాలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 11 నుంచి కేటీఆర్ బస్సు యాత్ర చేపట్టనున్నారు. మేడిగడ్డ నుంచి ఈ యాత్ర ప్రారంభమయ్యేలా పార్టీ నాయకత్వం కార్యాచరణ రూపొందించింది. తెలంగాణలో ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడి కరువు పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందన్న అంశాన్ని కూడా రాజకీయంగా ప్రస్తావించాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఇప్పటికే కేటీఆర్, హరీశ్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నీటి సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని బీఆర్ఎస్ వ్యూహరచన చేస్తోంది. బస్సు యాత్ర చేపట్టిన ఆరు నెలల తర్వాత పాదయాత్ర చేపట్టాలనే ఆలోచనలో కేటీఆర్ ఉన్నట్లు బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
నవంబర్ 29న దీక్షా దివస్.. ఉద్యమ సెంటిమెంట్‌కు పదును
తెలంగాణ ఉద్యమ చరిత్రను మరోసారి ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. ప్రతి ఏడాది నిర్వహించే దీక్షా దివస్‌ను ఈసారి కూడా ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. నవంబర్ 29న అలుగునూరు సమీపంలో కేసీఆర్ నిరాహార దీక్షకు దిగడం, ఆ తర్వాత ఆయనను పోలీసులు అరెస్టు చేయడం తెలంగాణ ఉద్యమంలో కీలక పరిణామంగా నిలిచింది. ఈ నేపథ్యంలో నవంబర్ 29న అలుగునూరు లేదా సుల్తానాబాద్ సమీపంలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు పార్టీ ప్రణాళికలు రూపొందిస్తోంది. సభకు పెద్దఎత్తున జనసమీకరణ చేయాలని నాయకత్వం భావిస్తోంది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ పార్టీగా ప్రజల్లో తమకు ఉన్న గుర్తింపును తిరిగి బలపరుచుకోవాలని బీఆర్ఎస్ యోచిస్తోంది. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ అప్పటివరకు ఏదో ఒక కార్యక్రమంతో ప్రజల్లో ఉండాలని నిర్ణయించుకుంది.
కేసీఆర్ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్న గులాబీ నేతలు..?
బీఆర్ఎస్ తరఫున కేటీఆర్, హరీశ్‌రావు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే పార్టీ అధినేత కేసీఆర్ మాత్రం ఇంకా పూర్తిస్థాయిలో ప్రజాక్షేత్రంలోకి రావడం లేదు. దీంతో కేసీఆర్ ఎప్పుడు బయటకు వస్తారు..? ఫామ్‌హౌస్‌కే పరిమితమవుతారా..? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అయితే సరైన సమయం వచ్చినప్పుడు కేసీఆర్ ప్రజల్లోకి వస్తారని బీఆర్ఎస్ ముఖ్య నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే బాధ్యతను కేటీఆర్, హరీశ్‌రావులకు అప్పగించినట్లు తెలుస్తోంది. వారి పర్యటనలు, ఉద్యమ కార్యక్రమాల ద్వారా పార్టీ క్యాడర్లో కొత్త ఉత్సాహం నింపాలని కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.



