దీపావళికి తెలంగాణ కేబినెట్ గిఫ్టులు ఇవే
Telangana Cabinet: దీపావళి సందర్బంగా తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు తీసుకుంది. ప్రజలకు ఇందిరమ్మ జీవిత పథకాన్ని అమలు చేయనున్నారు.

Telangana Cabinet: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు దీపావళి వేడుకలు నిర్వహించడం నుంచి ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా కల్పించడం వరకు పలు అంశాలపై కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే పారిశ్రామిక పెట్టుబడుల ఆకర్షణ, కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ, ఉద్యోగ నియామకాలు, కొత్త కోర్టు పోస్టులు, ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు కమిషన్ల ఏర్పాటు వంటి అంశాలపై నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణ వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి పండుగను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తయిన అన్ని ఇళ్లలో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. లబ్ధిదారులతో కలిసి ప్రజాప్రతినిధులు వేడుకల్లో పాల్గొననున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన కుటుంబాలతో కలిసి పండుగ నిర్వహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు.
ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఈ నెల 19న రాష్ట్రవ్యాప్తంగా రెండు కీలక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. సిద్దిపేటలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనుండగా, మరోవైపు ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని అమలు చేయనున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 20 నుంచి 30వ తేదీ వరకు రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ఇందిరమ్మ కమిటీలు పర్యటించనున్నాయి. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ఇంటింటికీ వెళ్లి ప్రతి కుటుంబం నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ప్రజల అవసరాలు, సమస్యలను తెలుసుకుని ప్రభుత్వానికి వివరించేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
నవంబర్ 7 నుంచి కొడంగల్లో సీఎం పర్యటన
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నవంబర్ 7, 8, 9 తేదీల్లో కొడంగల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా నవంబర్ 9న కొడంగల్లో నిర్వహించనున్న భారీ రైతు సభలో సీఎం పాల్గొననున్నారు. రూ.9 వేల కోట్ల విలువైన అభివృద్ధి పథకాలను ప్రారంబించడంతో పాటు, పలు కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. తెలంగాణకు భారీ పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’ నిర్వహించనున్నారు. ఈ సదస్సుకు దేశ, విదేశాల నుంచి వందలాది మంది పారిశ్రామికవేత్తలు హాజరుకానున్నారు. ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీపడేలా రాష్ట్ర పారిశ్రామిక విధానాలను మరింత సరళీకృతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. గ్లోబల్ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి భారీ స్థాయిలో పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం విశ్వసిస్తోంది. పారిశ్రామిక అభివృద్ధికి ఈ సదస్సు కీలక వేదికగా నిలవనుంది.
కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణపై కీలక నిర్ణయం
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచించిన పరీక్షలను పూర్తి చేశారు. ప్రాజెక్టులోని బ్యారేజీల మరమ్మతులు, పునరుద్ధరణకు సంబంధించిన విధివిధానాలపై కేబినెట్లో చర్చించనున్నారు. పారదర్శక విధానంలో మరమ్మతులు చేపట్టి ప్రాజెక్టును తిరిగి వినియోగంలోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి ఎస్సీ, ఎస్టీ కమిషన్ను రద్దు చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇకపై ఎస్సీలకు, ఎస్టీలకు వేర్వేరుగా ప్రత్యేక కమిషన్లను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో కమిషన్లో ఒక చైర్మన్తో పాటు ఐదుగురు సభ్యులు ఉండనున్నారు. ఈ నిర్ణయంతో రెండు వర్గాలకు ప్రత్యేకంగా కమిషన్లు అందుబాటులోకి రానున్నాయి. మొత్తంగా తెలంగాణ కేబినెట్ సమావేశంలో ప్రజా సంక్షేమం, రైతుల సమస్యలు, ఇందిరమ్మ పథకాలు, పారిశ్రామిక పెట్టుబడులు, సాగునీటి ప్రాజెక్టుల పునరుద్ధరణ, సామాజిక న్యాయం, న్యాయవ్యవస్థ బలోపేతం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు.



