Prabhas Latest Movie: పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ బాక్సాఫీస్ రికార్డులు, ఆయన సినిమాల రేంజ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అయితే, సినిమా విజయాలు, అపజయాలతో సంబంధం లేకుండా తనను నమ్ముకున్న నిర్మాతలకు అండగా నిలవడంలో ప్రభాస్ ( Prabhas) ఎప్పుడూ ముందుంటారు. తాజాగా టాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్న ఓ వార్త సోషల్ మీడియాలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన భారీ చిత్రం ‘ది రాజా సాబ్’ (The Raja Saab) ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మించింది. అయితే, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. దీంతో నిర్మాతలు భారీ నష్టాలను చవిచూడాల్సి వచ్చిందనే వార్తలు వినిపించాయి. సాధారణంగా సినిమా ఫలితం నిరాశపరిస్తే హీరోలు తదుపరి ప్రాజెక్టులపై దృష్టి పెడతారు. కానీ, ప్రభాస్ ( Prabhas) మాత్రం తనను నమ్ముకున్న నిర్మాతలకు అండగా నిలుస్తారని మరోసారి నిరూపించుకున్నట్లు సమాచారం. ‘ది రాజా సాబ్’ (The Raja Saab)వల్ల ఎదురైన నష్టాలను పూడ్చేందుకు అదే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో మరో సినిమా చేస్తానని ప్రభాస్ హామీ ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. ఇచ్చిన మాటకు కట్టుబడి ఇప్పుడు ఆ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది.

ప్రభాస్ కోసం థ్రిల్లర్ కథను సిద్ధం చేస్తున్న కార్తీక్ ఘట్టమనేని..?

పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి మరో బ్లాక్‌బస్టర్ అందించగల దర్శకుడి కోసం అన్వేషిస్తున్న సమయంలో కార్తీక్ ఘట్టమనేని పేరు తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రభాస్ ఇమేజ్‌కు తగ్గట్టుగా ఓ పవర్‌ఫుల్ థ్రిల్లర్ కథను సిద్ధం చేసే బాధ్యతను ఆయనకు అప్పగించినట్లు సమాచారం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన మిరాయ్ ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఈ చిత్రంలో ఆయన చూపించిన విజువల్ టేకింగ్, మేకింగ్ శైలి నిర్మాణ సంస్థను ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రభాస్ కోసం ఓ ఆసక్తికరమైన థ్రిల్లర్ కథను సిద్ధం చేయాలని కార్తీక్‌ను కోరినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రభాస్ చేతిలో భారీ ప్రాజెక్టులు

ప్రస్తుతం ప్రభాస్ పలు భారీ పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్నారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న స్పిరిట్ (Spirit Movie) , హను రాఘవపూడితో చేస్తున్న ఫౌజీ ( Fauzi Movie ) , అలాగే కల్కి 2898 ఏడీ సీక్వెల్ వంటి ప్రాజెక్టులు ఆయన లైనప్‌లో ఉన్నాయి. ఈ సినిమాలకు సంబంధించిన కమిట్‌మెంట్లను బట్టి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కనున్న థ్రిల్లర్‌ను వచ్చే ఏడాది ప్రారంభించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. నిర్మాతలకు అండగా నిలుస్తారనే పేరున్న ప్రభాస్, ఈ ప్రాజెక్టుతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి మరో విజయాన్ని అందిస్తారా.. మిరాయ్‌తో ఆకట్టుకున్న కార్తీక్ ఘట్టమనేని, ప్రభాస్‌తో ఎలాంటి థ్రిల్లర్‌ను తెరకెక్కించనున్నారు… అనే విషయాలు తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.