Pawan Kalyan on Local Body Elections: అప్పుడంటే రాష్ట్ర ప్రయోజనాలకోసం త్యాగం. వైసీపీని గద్దె దించేందుకు కొన్ని సీట్లే ఇచ్చినా సర్దుకుపోయాం. ఆ పర్సెంటేజీలు, సీట్ల లెక్కలు ఇప్పుడు కుదరవని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ కుండబద్దలు కొట్టేశారు. మొత్తానికి పంతం పట్టి అనుకున్నది సాధించారు. 17 కార్పొరేషన్లలో ఐదుచోట్ల జనసేన పోటీకి టీడీపీ అంగీకరించేలా ఒత్తిడి తీసుకొచ్చారు. చివరికి చంద్రబాబును ఒప్పించారు.

ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో పవన్‌కల్యాణ్‌కు బాగా తెలుసు. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాల్లో కేవలం 21 నియోజకవర్గాలే కేటాయించినా సర్దుకుపోయారు. 21కి 21 సీట్లూ గెలిచి హండ్రెడ్‌ పర్సెంట్‌ స్రైక్‌ రేటుతో జనసేనతో విజయఢంకా మోగించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అలా సర్దుకుపోయేందుకు సిద్ధంగా లేమని ముందే చెప్పేశారు. గౌరవప్రదమైన సీట్లు కోరుకుంటూ.. మనసులోని మాటను చంద్రబాబుకు ముందే చెప్పేశారు. దాని ఫలితమే జనసేనకు ఐదు కార్పొరేషన్ల కేటాయింపు.

రాష్ట్రంలో జనసేన దక్కించుకున్న కార్పొరేషన్లన్నీ భౌగోళికంగా, రాజకీయంగా, సమీకరణాల పరంగా అత్యంత కీలకమైనవే. విజయవాడ, తిరుపతి, ఏలూరు, కాకినాడ, విజయనగరం కార్పొరేషన్లను పొత్తులో భాగంగా జనసేనకు ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించారు. వీటిలో విజయవాడ రాజకీయ రాజధాని. వంగవీటి రాధాను జనసేనలో చేర్చుకున్న పవన్‌కల్యాణ్‌.. రంగా వారసుడిని విజయవాడ బరిలో నిలబెట్టబోతున్నారు.

విజయవాడలో వంగవీటి రాధాతో పాటు ఐదు కార్పొరేషన్లలో బలమైన అభ్యర్థులను దించేందుకు జనసేన అధినేత కసరత్తు మొదలుపెట్టారు. కార్పొరేషన్లతో పాటు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20నుంచి 27 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో జనసేన పోటీకి దిగబోతోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే రిపీట్‌ అయితే స్థానికంగా, సంస్థాగతంగా జనసేన మరింత బలోపేతం కాబోతోంది.