పవన్ కల్యాణ్ మూడో వివాహబంధానికి ముగింపు
Pawan Kalyan Divorce:

Pawan Kalyan Divorce: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వ్యక్తిగత జీవితం మరోసారి వార్తల్లో నిలిచింది. రష్యాకు చెందిన అన్నా లెజినోవాతో ఆయన వివాహబంధానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించడం రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు పవన్ కల్యాణ్, అన్నా లెజినోవా ఇద్దరూ ఉమ్మడిగా ప్రకటన విడుదల చేశారు. జనసేన మీడియా విభాగం ద్వారా ఈ విడాకుల ప్రకటనను వెల్లడించారు. తమ జీవితంలో ఒక ముఖ్యమైన భాగాన్ని కలిసి పంచుకున్న తర్వాత, పరస్పర అవగాహన, గౌరవంతో విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నారు. వివాహబంధం ముగిసినప్పటికీ ఒకరిపై మరొకరికి గౌరవం కొనసాగుతుందని, మంచి స్నేహితులుగా ఉంటామని స్పష్టం చేశారు. అంతేకాదు, తమ పిల్లలకు అంకితభావంతో కూడిన తల్లిదండ్రులుగా కొనసాగుతామని వెల్లడించారు.
“పిల్లలే మా తొలి ప్రాధాన్యత”
విడాకుల నిర్ణయం తీసుకున్నప్పటికీ తమ పిల్లల భవిష్యత్తు విషయంలో ఎలాంటి రాజీ ఉండదని పవన్ కల్యాణ్, అన్నా లెజినోవా స్పష్టం చేశారు. పిల్లల సంతోషం, శ్రేయస్సు ఎప్పటికీ తమ మొదటి ప్రాధాన్యతగా ఉంటాయని తెలిపారు. ప్రస్తుతం తమ వ్యక్తిగత జీవితంలో చోటుచేసుకుంటున్న మార్పులను అందరూ అర్థం చేసుకోవాలని, తమ గోప్యతకు గౌరవం ఇవ్వాలని అభిమానులు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇప్పటివరకు తమ ప్రయాణంలో తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
తీన్ మార్ సినిమా సమయంలో పరిచయం.. 2013లో వివాహం
పవన్ కల్యాణ్, అన్నా లెజినోవా పరిచయం వెనుక సినీ నేపథ్యం ఉంది. తీన్ మార్ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారి, చివరకు వివాహబంధానికి దారితీసింది. 2013లో ఇద్దరూ వివాహం చేసుకున్నారు. వీరికి పోలేనా అంజనా పవనోవా, మార్క్ శంకర్ పవనోవిచ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. దాదాపు పదమూడేళ్ల వైవాహిక జీవితానికి ఇప్పుడు ముగింపు పలకాలని నిర్ణయించుకోవడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాలను మాత్రం ఉమ్మడి ప్రకటనలో వెల్లడించలేదు. మరోవైపు, విడిపోవడానికి బలమైన కారణాలు ఉన్నాయని సన్నిహిత వర్గాలు చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
మూడు వివాహాలు.. ఇప్పుడు మూడో బంధానికీ ముగింపు
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వ్యక్తిగత జీవితంలో ఇప్పటికే రెండు వివాహబంధాలు ముగిశాయి. 1997లో విశాఖపట్నానికి చెందిన నందినిని ఆయన తొలుత వివాహం చేసుకున్నారు. అయితే వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో 1999లో విడిపోయారు. అనంతరం 2008లో అధికారికంగా విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత నటి రేణు దేశాయ్‌తో పవన్ కల్యాణ్‌కు పరిచయం ఏర్పడింది. జానీ సినిమా సమయంలో మొదలైన పరిచయం ప్రేమగా మారింది. వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు అకీరా నందన్, ఆద్య జన్మించారు. అయితే 2011లో వీరిద్దరూ విడిపోయారు. 2012లో అధికారికంగా విడాకులు తీసుకున్నారు. అనంతరం 2013లో రష్యాకు చెందిన అన్నా లెజినోవాను పవన్ కల్యాణ్ వివాహం చేసుకున్నారు. ఇప్పుడు ఈ మూడో వివాహబంధానికి కూడా ముగింపు పలకాలని నిర్ణయించుకోవడంతో ఆయన వ్యక్తిగత జీవితం మరోసారి చర్చల్లోకి వచ్చింది.
నాలుగో పెళ్లి ఉంటుందా..? సోషల్ మీడియాలో హాట్ టాపిక్…?
మూడో వివాహబంధానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో ఇప్పుడు మరో ప్రశ్న తెరపైకి వస్తోంది. పవన్ కల్యాణ్ నాలుగో వివాహం చేసుకుంటారా? ఒక ఏడాది తర్వాత మరో వివాహం చేసుకునే అవకాశం ఉందని ఆయన సన్నిహితుల పేరుతో ప్రచారం జరుగుతోంది. ఒకవైపు రాజకీయాల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కల్యాణ్.. మరోవైపు వ్యక్తిగత జీవితంలో తీసుకున్న ఈ నిర్ణయంతో వార్తల్లో నిలిచారు. నాలుగో వివాహంపై సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. అయితే భవిష్యత్తులో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పటికైతే ప్రశ్నార్థకంగానే ఉంది. మొత్తానికి, మూడు వివాహాలు.. రెండు విడాకుల తర్వాత మూడో వివాహబంధానికి కూడా ముగింపు పలకాలని పవన్ కల్యాణ్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాజకీయ, సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ సమయంలో పవన్ కల్యాణ్, అన్నా లెజినోవా ఇద్దరూ స్పష్టం చేసిన ఒకే విషయం.. తమ పిల్లల సంతోషం, భవిష్యత్తే తమకు అత్యంత ముఖ్యమని..



