NTR-త్రివిక్రమ్ మూవీ క్రేజీ అప్డేట్
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ సినిమా త్వరలో పట్టాలెక్కనుంది. ఇప్పటికే సినిమాకు సంబంధించి అప్డేట్ను మేకర్స్ విడుదల చేయగా.. తాజా ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు త్రివిక్రమ్ సంచలన విషయాలు చెప్పారు.

Jr NTR Trivikram: నందమూరి నటవంశం అంటేనే మనకు ముందుగా గుర్తుకొచ్చేది పౌరాణిక పాత్రలు. విశ్వవిఖ్యాత నటుడు ఎన్టీఆర్ తన పౌరాణిక చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఏ స్థానం సంపాదించుకున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ తర్వాత బాలకృష్ణ కూడా అదే బాటలో కొన్ని అద్భుతమైన పౌరాణిక పాత్రలతో అలరించారు. మరి ఇప్పుడు నందమూరి మూడో తరం, యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం పౌరాణిక రంగంలోకి దిగడానికి సిద్ధమవుతున్నారు. అది కూడా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచీ టాలీవుడ్లో ఒకటే అంచనాలు. అసలు ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కనుంది..? ఎలాంటి కథతో రాబోతోంది..?అనే విషయాలపై ఇప్పుడు సోషల్ మీడియాలో డిస్కషన్ నడుస్తోంది.
సంచలన విషయాలు చెప్పిన త్రివిక్రమ్
ఈ నేపథ్యంలోనే త్రివిక్రమ్ త్వరలో రిలీజ్ కాబోతున్న తన ఆదర్శకుటుంబం సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టారు. జగపతి బాబు నిర్వహిస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ -2 కార్యక్రమంలో త్రివిక్రమ్, సునీల్, తమన్ పాల్గొన్న సంగతి తెలిసిందే. అక్కడే ఎన్టీఆర్ (Jr NTR) సినిమా గురించి అసలు విషయం బయటపడింది. తారక్‌తో తీయబోయే పౌరాణిక చిత్రం గురించి త్రివిక్ (Trivikram ) మాట్లాడుతూ.. ఇది కేవలం తన ఆలోచన మాత్రమే కాదని, సాక్షాత్తూ దైవసంకల్పమే అని తెలిపారు. తన మనసులో ఆరు ముఖాలు కలిగిన రూపం ప్రత్యక్షం కాగానే, సంభాషణలు వాటంతట అవే కవిత్వమై ప్రవహించాయని త్రివిక్రమ్ చెప్పడం విశేషం.
సినిమా పేరు గాడ్ ఆఫ్ వార్..?
ఆరు ముఖాలు అంటే సాక్షాత్తూ షణ్ముఖుడైన సుబ్రహ్మణ్యస్వామియే అని తెలుస్తోంది. దేవసేనాని అయిన కుమారస్వామిని గాడ్ ఆఫ్ వార్ అని పిలుస్తారు. దీంతో ఎన్టీఆర్- త్రివిక్రమ్ కాంబోలో రాబోయే ఈ చిత్రానికి గాడ్ ఆఫ్ వార్ ( God of War) అనే టైటిల్ ఫిక్స్ అయిందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే, దీనిపై ఇటీవల నిర్మాత నాగవంశీ స్పందిస్తూ.. ఇది ఇంకా అధికారికం కాదని తేల్చిచెప్పడంతో, టైటిల్ పై రకరకాల ఊహాగానాలు మళ్లీ మొదలయ్యాయి. ఏదేమైనా త్రివిక్రమ్ (Trivikram ) మాటలను బట్టి చూస్తుంటే ఈ సినిమా ఏ స్థాయిలో ఉండబోతుందో ఊహించుకోవచ్చు. ఇక ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఎప్పుడో పూర్తయిపోయినట్లు సమాచారం. ఆదర్శకుటుంబం విడుదల తర్వాత త్రివిక్రమ్ పూర్తిగా ఈ సినిమాపైనే దృష్టి పెట్టనున్నారు. ప్రస్తుతం తారక్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వగానే, ఎన్టీఆర్ (Jr NTR) నేరుగా త్రివిక్రమ్ సెట్స్‌లో అడుగుపెట్టనున్నట్లు సమాచారం..
మూవీ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
తాత చూపిన బాటలో, బాబాయ్ చూపిన బాటలోనే ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) కుమారస్వామి పాత్రలో ఏ విధంగా విశ్వరూపం చూపిస్తారో అని ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. తారక్ బాడీ లాంగ్వేజ్, త్రివిక్రమ్ మాటల తూటాలు.. రెండూ కలిస్తే బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు తిరగరాయబడతాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరి ఈ మైథలాజికల్ వండర్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. గతంలో త్రివిక్రమ్- ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన అరవింద సమేతా రికార్డులు బద్దలు కొట్టగా.. ఇప్పుడు మరోసారి ఇద్దరి కాంబో సినిమాపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.



