కూటమి ఎన్నికల వ్యూహకర్తగా నారా లోకేశ్.. 95 శాతం స్ట్రైక్ రేట్
Nara Lokesh Political Strategy: ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ మున్సిపాలిటీ, పరిషత్ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా పని చేశారు. తెరవెనుక ఉంటూ నిత్యం నాయకులతో టచ్‌లో ఉన్నారు. ఫలితంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 95 శాతం స్ట్రైక్ రేట్‌తో కూటమి పార్టీలు విజయం సాధించారు. వచ్చే పంచాయతీ ఎన్నికల్లో మరోసారి వార్‌రూమ్ వేదికగా వ్యూహాలు రచించనున్నట్లు సమాచారం.

Nara Lokesh Political Strategy: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) పేరు మార్మోగిపోతోంది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన.. రాజకీయ వ్యూహకర్తగా తనదైన ముద్ర వేస్తున్నారు. మున్సిపాలిటీ, పరిషత్ ఎన్నికల్లో కూటమి పార్టీలు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 95 శాతం స్ట్రైక్ రేట్‌తో విజయాలు సాధించేలా తెరవెనుక వ్యూహరచన చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ఎన్నికల సమయంలో నాయకులు ప్రచారాలతో హడావుడి చేస్తుంటారు. కానీ నారా లోకేశ్ (Nara Lokesh) మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు. ఎన్నికల ప్రక్రియ మొత్తం తెరవెనుక ఉండి, ప్రత్యేక వార్ రూమ్ ఏర్పాటు చేసి, తన కోర్ టీమ్‌తో కలిసి క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించారు. జిల్లా, మండల స్థాయి నాయకులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా రాప్తాడు బాలిక ఘటన తర్వాతే ఆయన బయట కనిపించారంటే, అంతకుముందు ఎన్నికల వ్యూహరచనలో ఎంతగా నిమగ్నమయ్యారో అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా ఎన్నికల బరిలో తాను కనిపించకపోయినా.. విజయాల వెనుక తన వ్యూహాన్ని కనిపించేలా చేశారు.
వర్షాలపై చంద్రబాబు ఫోకస్.. పార్టీ బలోపేతంపై లోకేశ్ ఫోకస్
మున్సిపాలిటీ ఎన్నికల సమయంలో అర్నబ్ తుఫాన్ ప్రభావం ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయ, పరిపాలనా వర్గాల్లో సవాల్‌గా మారింది. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలతో పాటు విశాఖపట్నం, విజయనగరం జిల్లాలపై తుఫాన్ ప్రభావం పడటంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) పూర్తిగా సహాయక చర్యలు, ప్రజల భద్రత, అధికార యంత్రాంగం సమన్వయంపై దృష్టి సారించారు. ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని, అవసరమైన చర్యలు వేగంగా చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఒకవైపు ముఖ్యమంత్రి పాలనాపరమైన బాధ్యతల్లో నిమగ్నమైతే, మరోవైపు పార్టీ వ్యవహారాలను మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) సమర్థంగా ముందుకు నడిపించారు. ప్రకృతి విపత్తు ప్రభావం ఎన్నికలపై పడకుండా, కేడర్ ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. జిల్లా, మండల స్థాయి నాయకులతో నిరంతరం మాట్లాడుతూ ఎన్నికల వ్యూహాలను అమలు చేశారు. ఫలితంగా శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు కూటమి పార్టీలకు అనుకూలమైన ఫలితాలు వచ్చాయని టీడీపీ శ్రేణులు విశ్వసిస్తున్నాయి. ఒకవైపు ప్రభుత్వ పాలనకు ఆటంకం కలగకుండా, మరోవైపు పార్టీ ఎన్నికల లక్ష్యాలు దెబ్బతినకుండా సమాంతరంగా బాధ్యతలు నిర్వహించడం లోకేశ్ రాజకీయ చొరవకు నిదర్శనంగా పార్టీ నేతలు అభివర్ణిస్తున్నారు.
మురసు తుఫాన్ వచ్చినా వెనక్కి తగ్గని వ్యూహం
పరిషత్ ఎన్నికల సమయంలో మురసు తుఫాన్ ప్రభావం నేపథ్యంలో ఎన్నికలు వాయిదా పడతాయని పలువురు భావించారు. అయితే ఎన్నికల నిర్వహణపై స్పష్టత రావడంతో కూటమి నాయకత్వం మరోసారి ఎన్నికల కార్యాచరణను వేగవంతం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) తనదైన శైలిలో పార్టీ శ్రేణులను అప్రమత్తం చేశారు. ఈసారి కూడా బయటకు పెద్దగా కనిపించకుండా తెరవెనుక నుంచే ఎన్నికల వ్యవహారాలను పర్యవేక్షించారు. అన్ని జిల్లా పరిషత్‌లలో కూటమి ఆధిపత్యం సాధించాలనే లక్ష్యంతో నాయకులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేస్తూ, బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఫలితంగా వైసీపీకి బలమైన పట్టున్న ప్రాంతాల్లోనూ కూటమి అభ్యర్థులు విజయాలు సాధించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. విజయనగరం జిల్లాలో బొత్స సత్యనారాయణ కుమార్తె బొత్స ఝాన్సీ ఓటమి, పుంగనూరు జడ్పీటీసీతో పాటు ఎంపీటీసీ స్థానాల్లో కూటమి విజయాలు సాధించడం వైసీపీకి గట్టి ఎదురుదెబ్బగా మారాయి. మున్సిపాలిటీ, పరిషత్ ఎన్నికల ఫలితాలు కూటమి శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపడమే కాకుండా, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు మరింత ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చాయి.
పంచాయతీ ఎన్నికలే తదుపరి లక్ష్యం.. మళ్లీ లోకేశ్ వార్ రూమ్
మున్సిపాలిటీ, పరిషత్ ఎన్నికల్లో సాధించిన విజయాలతో కూటమి ఇప్పుడు తదుపరి ఎన్నికలపై దృష్టి సారిస్తోంది. త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లోనూ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో కార్యాచరణ సిద్ధం చేస్తోంది. గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీలకు కేటాయించిన స్థానాలు, అక్కడ అభ్యర్థుల పనితీరు, విజయాలు, ఓటములపై సమగ్రంగా సమీక్షించేందుకు కూటమి నాయకత్వం సిద్ధమవుతోంది. ముఖ్యంగా పొత్తుల విషయంలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ముందస్తు కసరత్తు చేయాలని భావిస్తోంది. అనంతపురం మున్సిపాలిటీ స్థానాన్ని బీజేపీకి కేటాయించినప్పటికీ, అక్కడ ఆ పార్టీ అభ్యర్థి ఓటమి పాలై వైసీపీ అభ్యర్థి విజయం సాధించిన నేపథ్యంలో ఈ అంశాన్ని ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకోనున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కూటమి నేతలు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan), బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ మరోసారి సమావేశమై పొత్తులు, స్థానాల కేటాయింపుపై చర్చించనున్నట్లు కూటమి వర్గాలు చెబుతున్నాయి.
తెరవెనక నడిపించడం లోకేశ్ ప్రత్యేకత
మంత్రి నారా లోకేశ్ రాజకీయ ప్రస్థానంలో ఈ ఎన్నికలు ఒక కీలక మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది. ఇప్పుడు ఎన్నికల నిర్వహణ, పార్టీ సమన్వయం, కేడర్ బలోపేతం వంటి అంశాల్లో తనదైన పనితీరును ప్రదర్శిస్తున్నారు. నాయకుడంటే ఎప్పుడూ ప్రజల మధ్య కనిపించడం మాత్రమే కాదు.. అవసరమైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం, బృందాన్ని నడిపించడం, కార్యకర్తలకు భరోసా ఇవ్వడం, లక్ష్యాన్ని సాధించే వరకు పట్టుదలగా పనిచేయడం కూడా ముఖ్యమేనని లోకేశ్ (Nara Lokesh) తన కార్యాచరణతో చాటుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రచార ఆర్భాటానికి దూరంగా ఉండి, తెరవెనుక వ్యూహాలకు ప్రాధాన్యత ఇవ్వడం ఆయన ప్రత్యేకతగా మారింది. ఇప్పుడు మున్సిపాలిటీ, పరిషత్ ఎన్నికల విజయాల స్ఫూర్తితో పంచాయతీ ఎన్నికల దిశగా అడుగులు వేస్తున్న వేళ.. కూటమి రాజకీయాల్లో నారా లోకేశ్ పాత్ర మరింత కీలకంగా మారనుంది. మొత్తంగా, ముందుండి హడావుడి చేయడం కంటే.. తెరవెనుక ఉండి విజయానికి బాటలు వేయడమే తన శైలిగా మార్చుకున్న నారా లోకేశ్.. కూటమి రాజకీయాల్లో కీలక వ్యూహకర్తగా తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటున్నారు.



