Mega Family Divorces: మెగా కుటుంబంలో వరుస విడాకుల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్ మూడో భార్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటన వెలువడిందనే ప్రచారంతో మెగా ఫ్యామిలీలో గతంలో విడాకులు తీసుకున్న వారి గురించి నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇప్పటివరకు మెగా, అల్లు కుటుంబాలకు చెందిన పలువురు దాంపత్య జీవితానికి ముగింపు పలికారు. వారెవరంటే..

రెండుసార్లు పెళ్లి.. ఇద్దరు భర్తలకు దూరమైన శ్రీజ

మెగాస్టార్ చిరంజీవి కుమార్తె శ్రీజ కొణిదెల 2007లో శిరీష్ భరద్వాజ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహం అప్పట్లో సంచలనంగా మారింది. వీరికి ఒక కుమార్తె జన్మించినప్పటికీ, కొంతకాలానికే మనస్పర్థలు మొదలయ్యాయి. 2011లో భర్తపై వరకట్న వేధింపుల కేసు పెట్టిన శ్రీజ పుట్టింటికి చేరుకున్నారు. చివరకు 2014లో వీరికి విడాకులు మంజూరయ్యాయి. ఆ తర్వాత 2016లో వ్యాపారవేత్త కుమారుడు కల్యాణ్ దేవ్‌ను రెండో వివాహం చేసుకున్నారు. వీరికి 2018లో కుమార్తె నవిష్క జన్మించింది. అయితే ఈ బంధం కూడా ఎక్కువకాలం నిలవలేదు. గత కొంతకాలంగా వీరిద్దరూ విడివిడిగా ఉంటున్నారు. ప్రస్తుతం మరో వ్యక్తితో రిలేషన్‌లో ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

పెళ్లైన రెండేళ్లకే విడాకులు తీసుకున్న నిహారిక

మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల 2020లో జొన్నలగడ్డ వెంకట చైతన్యను వివాహం చేసుకున్నారు. సినీ నేపథ్యం లేని కుటుంబానికి చెందిన చైతన్యతో ఆమె వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అయితే వీరి వైవాహిక జీవితం ఎక్కువకాలం సాగలేదు. 2023లో ఇద్దరూ విడాకులు తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించడంతో ఈ విషయం అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది. విడాకుల అనంతరం నిహారిక తిరిగి సినిమాలు, వెబ్ సిరీస్‌ల నిర్మాణంపై దృష్టి సారించారు.

అల్లు బాబీ కూడా మొదటి భార్యకు విడాకులు

అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబీ కూడా విడాకులు తీసుకున్నారు. 2005లో నీలిమ బండిని వివాహం చేసుకున్న ఆయనకు ఒక కుమార్తె ఉంది. వ్యక్తిగత కారణాలతో ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో 2016లో పరస్పర అంగీకారంతో విడిపోయారు. అనంతరం 2019లో ముంబైకి చెందిన వ్యాపారవేత్త కుమార్తె నీలూ షాను రెండో వివాహం చేసుకున్నారు. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, కొద్దిమంది బంధుమిత్రులు మాత్రమే హాజరయ్యారు.

మెగా కుటుంబంలో విడాకులపై మరోసారి చర్చ

ఇలా మెగా, అల్లు కుటుంబాలకు చెందిన పలువురి వైవాహిక జీవితాలు విడాకులతో ముగియడంతో మరోసారి ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్ నుంచి శ్రీజ, నిహారిక, అల్లు బాబీ వరకు విడాకుల వ్యవహారాలు తెరపైకి రావడంతో సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మెగా కుటుంబానికి పెళ్లిళ్లు కలిసి రావడం లేదంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.